ఓటరు నమోదుకు భారీ స్పందన
హైదరాబాద్,సెప్టెంబర్26(జనంసాక్షి): ఓటరు నమోదు దరఖాస్తులు చివరి రోజైన మంగళవారం భారీ సంఖ్యలో నమోదయ్యాయి. మొత్తంగా నూతన ఓటు కోసం లక్షల్లో దరఖాస్తులు నమోదైనట్లు అధికారులు చెపుతున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 10 నుంచి ఓటరు నమోదుపై రెవెన్యూ అధికారులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అదేరోజు పోలింగ్ బూత్‌లలో ఓటరు జాబితాను ప్రదర్శించి అభ్యంతరాల స్వీకరణ ప్రారంభించారు. బూత్‌లెవల్ అధికారులు సైతం ఇంటింటి సందర్శన ద్వారా ఓటు హక్కు విలువను వివరిస్తూ దరఖాస్తులు నేరుగా స్వీకరించారు. ముఖ్యంగా ఈనెల 15, 16 తేదీలలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ సత్ఫలితాలనిచ్చింది. ప్రత్యేకంగా ఫాం-6 ద్వారా కొత్త ఓటరు దరఖాస్తులు, ఫాం-7 ద్వారా తొలగింపు దరఖాస్తులు, ఫాం-8 ద్వారా సవరణ దరఖాస్తులు, ఫాం-8ఏ ద్వారా పోలింగ్ స్టేషన్ల మార్పు వంటి వాటికి సంబంధించిన దరఖాస్తులు స్వీకరించారు. ధరఖాస్తుల స్వీకరణను చివరి రోజైన మంగళవారం అధికారులు ఎక్కడిక్కడ పర్యవేక్షించారు.