ఓట్లను పెంచుకునే యత్నంలో బిజెపి

పట్టు సాధించేలా గట్టిగా ప్రయత్నాలు
కడప,అక్టోబర్‌29(జనంసాక్షి): జిల్లా బద్వేలు అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో గౌరవప్రదమైన ఓట్లను దక్కించుకోవడంపై బీజేపీ నేతలు ప్రధానంగా దృష్టి సారించారు. టిడిపి పోటీలో లేకపోవడంతో వైసిపి వ్యతిరేక ఓట్లు తమకే పడతాయన్న ధీమాలో ఉన్నారు. లోపాయకారిగా టిడిపి కూడా బిజెపికి మద్దతు ప్రకటించిందని సమాచారం. గత మూడు పర్యాయాలుగా అక్కడ పోటీ చేసినా పట్టుమని ఏడు వందల ఓట్లు కూడా రాకపోవడంతో బిజెపికి ఈ మారు ఎంత ఓటింగ్‌ శాతం పెరుగుతుందన్నది చూడాలి. లోపాయికారీగా టీడీపీ మద్దతు కూడగట్టారని అంటున్నారు. ఈసారి టీడీపీ బరిలో లేనందున ఓట్ల శాతాన్ని పెంచుకునేందుకు బీజేపీలో చేరిన సీఎం రమేష్‌, ఆదినారాయణరెడ్డి తదితరుల ద్వారా పావులు కదుపు తున్నారు. బీజేపీ నాయకులు వీరితో కలసి స్థానిక టీడీపీ నేతల ఇళ్ల వద్దకు వెళ్లి ఆ పార్టీ క్యాడర్‌ తమకు మద్దతిచ్చేలా చూడాలని కోరుతున్నారు. టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులకు ఫోన్లు చేయిస్తూ తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. బద్వేలులో బీజేపీకి క్యాడర్‌ లేకపోవడంతో అత్యధిక పోలింగ్‌ బూత్‌ల్లో ఏజెంట్లు దొరకక టీడీపీ కార్యకర్తలను తమవైపు తిప్పుకుంటున్నారు. పనతల సురేష్‌ను బీజేపీ తన అభ్యర్థిగా నిలిపింది. వాస్తవానికి నియోజకవర్గంలో బీజేపీకి నామమాత్రంగా కూడా కార్యకర్తలు లేరు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు సోము వీర్రాజు, ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్‌ స్వయంగా చర్చలు జరిపి తమకు అనుకూలంగా వ్యవహరించేలా ఒప్పందాలు చేసుకున్నారు. పోరుమామిళ్ల, బద్వేలు ప్రాంతాల్లోనూ ఇదే తరహా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ తనయుడు రితేష్‌రెడ్డితో ఇప్పటికే బీజేపీ నేతలు చర్చలు జరిపారు. కొందరు టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాత్రం అక్రమ పొత్తులను వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. పోటీ చేయరాదని పార్టీ నాయకత్వం నిర్ణయించినందున తమ అభీష్టం ప్రకారం ఓటు వేయనివ్వాలని సూచించినట్లు సమాచారం.