ఓనం ముందు కళతప్పిన కేరళ

ఇంకా బురదగుప్పిట్లోనే ఇళ్లు

తిరువనంతపురం,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): వరదలు మిగిల్చిన విషాదంతో కేరళలో ఈసారి ఓనం పండగ కళ తప్పింది. వరదల కారణంగా ఓనం పండుగ జరపుకోరాదని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలు కూడా అదే ఆలోచనతో మిన్నకున్నారు. ఇప్పుడు వీరంతా బురదలో మునిగిపోయిన ఇండ్లను శుభ్రం చేసేపనిలో పడ్డారు. వందేళ్లలో ఓనంను ఇలా ఎప్పుడు జరుపుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా ఓనం రోజున కేరళ కలర్‌ ఫుల్‌ గా మారేది, ఎక్కడా చూసినా సంబరాలే కనిపించేవి. మహిళలు సంప్రదాయ రీతిలో తెల్లటి పట్టుచీరలతో రెడ్డీ అయి..ఆటపాటలతో వేడుక జరుపుకునేవారు. అయితే ఈసారి విపత్తు బారిన పడటంతో ఎక్కువ ఆడంబరాలకు పోకుండా ఆలయాల్లో పూజల వరకే పరిమితమవుతున్నారు మలయాళీలు. అయితే కొన్ని ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు ఉండటంతో స్థానికులు సాదాసీదాగా ఓనంను జరుపుకుంటున్నారు. కొయంబత్తూరులో ఉదయం నుంచే ప్రజలు ఆలయాలకు వెళ్లి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయాలను పూలతో అలంకరించారు. కేరళ రాష్ట్రం త్వరగా కోలుకోవాలని కోరుకున్నట్లు చెప్పారు. అయితే చాలామంది ఇంకా వరదల భయం నుంచి తేరుకోలేదు. ఇళ్లలో అడుగుపెట్టాలంటేనే భయంకరంగా ఉందని వాపోయారు.