కంపెనీ కబందహస్తాల్లో కుంట శిఖం

– విముక్తి కల్పించాలంటూ కలెక్టర్ కు ఫిర్యాదు

ఫొటో ఉంది
హత్నూర (జనం సాక్షి)
మండలం పరిధిలోని బోర్పట్ల గ్రామ సమీపంలో గల నేరటివారి కుంట శిఖం ఆక్రమణకు గురవుతుందని ఆ గ్రామస్తుడు విఠల్ ఆరోపించాడు.దౌల్తాబాద్ లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అరబిందో ఫార్మా యూనిట్-1 పరిశ్రమకు ‌ఆనుకుని ఉన్న సర్వే నెంబర్ 387 లో 9ఎకరాల 25 గుంటల విస్తీర్ణం గల నేరటివారి కుంట శిఖం కబ్జాకు గురవుతుందని పేర్కొంటూ గ్రామస్తులం జిల్లా కలెక్టర్ శరత్ కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాదు ప్రతుల్ని కలెక్టర్ కు అందజేశామని వారన్నారు.అరబిందో కంపెనీ యాజమాన్యం కుంట శిఖంలో నుండి 20 గుంటల స్థలాన్ని ఆక్రమించుకుని అందులో సిమెంటు పిల్లర్లు నిర్మించి స్టీమ్ పైప్ లైన్ ఏర్పాటు చేశారని వారు ఆరోపించారు.ఈ విషయమై ఇదివరకు సంబంధిత జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని వారన్నారు.రైతులు పంటలు పండించుకునేందుకు ప్రధాన నీటి వనరైన కుంట శిఖం కబ్జాకు గురవుతున్నా సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. స్థానిక రెవెన్యూ అధికారులు చుట్టపుచూపుగా కబ్జాకు గురైన స్థలాన్ని పరిశీలించి చేతులు దులుపుకుంటున్నారని వారు విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అరబిందో కంపెనీ అక్రమంగా కబ్జా చేసిన కుంట శిఖాన్ని కాపాడాలని వారు డిమాండ్ చేశారు.