కన్నాది బాధ్యతా రాహిత్యం: కాల్వ

అనంతపురం,అక్టోబర్‌22(జ‌నంసాక్షి): రాయలసీమతో పాటు ఇతర వెనకబడిన జిల్లాల అభివృద్ధి కోసం వచ్చిన రూ.350 కోట్ల నిధులు కేంద్రం వెనక్కి తీసుకున్నా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏం చేస్తున్నారని, ఆయనకు ఎపి అభివృద్దిపై బాధ్యత లేదా అని మంత్రి కాలవ శ్రీనివాసులు
ప్రశ్నించారు. కడపలో ఉక్కు కర్మాగారం, కర్నూలులో రైల్వేకోచ్‌ కర్మాగారం, అనంతపురంలో సెంట్రల్‌ యూనివర్సిటీలపై ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన కన్నా ఇప్పుడు నోరెందుకు మెదపడం లేదని మంత్రి తీవ్రస్వరంతో ప్రశ్నించారు. టీడీపీని బలహీన పరిచేందుకు దుష్టశక్తులు నానా కుతంత్రాలు
పన్నుతున్నాయని, అందులో బిజెపి ముందున్నదిన మండిపడ్డారు. ప్రధాని మోదీ చేతిలో జగన్‌, పవన్‌ కీలుబొమ్మలని అన్నారు. వైఎస్సార్‌ పరిపాలనలో పరిటాల రవిని హత్య చేశారు. ఫ్యాక్షన్‌ రాజకీయాలకు అడ్డా వైసీపీ. టీడీపీకి జిల్లా కంచుకోట. ఎన్టీఆర్‌ను ఇందిరమ్మ బర్తరఫ్‌ చేస్తే నెల రోజుల్లోనే తిరిగి
ఎన్టీఆర్‌ను సీఎంని చేసిన ఘనత టీడీపీ కార్యకర్తలదే అని మంత్రి అన్నారు. జగన్‌ చేస్తున్న సంకల్ప యాత్ర పాపపరిహార యాత్రగా సాగుతోంది. జగన్‌ చరిత్ర ఫ్యాక్షన్‌ చరిత్ర అన్నారు. దోచుకుని, దాచుకోవాలన్న తాపత్రయం ఉన్న పార్టీఅన్నారు. తెలుగుదేశం చేసిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి
తట్టుకోవడం లేదన్నారు.