కన్నా, పవన్‌, జగన్‌లు రాష్ట్ర ద్రోహులు 

– జేబులో వైసీపీ జెండాతో బీజేపీలో ఉన్న వ్యక్తి కన్నా
– మోడీని ఎదిరించిన ఏకైక వ్యక్తి చంద్రబాబు
– విలేకరుల సమావేశంలో మంత్రి ఆనందబాబు
గుంటూరు, అక్టోబర్‌20(జ‌నంసాక్షి) : కేంద్రం సహకారం లేకపోయినా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఏపీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. శనివారం గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. కన్నా లక్ష్మీనారాయణ, పవన్‌ కల్యాణ్‌, జగన్‌మోహన్‌రెడ్డిలు రాష్ట్ర ద్రోహులని ఘాటుగా వ్యాఖ్యాన్నించారు. మోదీ, అమిత్‌షాలు చెప్పింది చేయడమే వీరి పని అని ఎద్దేవా చేశారు. పవన్‌, జగన్‌లు ఏపీలో మోదీకి పావులుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్ర,శనివారాలు జగన్‌ కోర్టు పనివిూద వెళితే.. ఆ సమయంలో ఢిల్లీ నుంచి జీవీఎల్‌ నరసింహారావు వస్తారని మంత్రి అన్నారు. కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ జీవితమేంటో గుంటూరు ప్రజలకు తెలుసని, ఆయన వైసీపీలో చేరడానికి సిద్ధమై ఎందుకు ఆగిపోయారో సమాధానం లేదన్నారు. వైసీపీ ఒప్పందంలో భాగమే కన్నాకు బీజేపీ అధ్యక్ష పదవి అని, కన్నా జేబులో వైసీపీ జెండా పెట్టుకుని బీజేపీలో తిరుగుతున్నాడని మంత్రి తీవ్రంగా విమర్శించారు. అంతేగాక కేంద్రం సహకారంతో జగన్‌ కేసులు ముందుకు కదలడం లేదని, ఏపీ అభివృద్ధిని అడ్డుకోవడమే జగన్‌ లక్ష్యంగా ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఎదిరించిన ఏకైక నాయకుడు చంద్రబాబునాయుడు అని మంత్రి ఆనందబాబు పేర్కొన్నారు.