కరాచీ ప్రైవేట్‌ విమానానికి తప్పిన ముప్పు

గాలిలోనే తెరుచుకున్న డోర్‌

అత్యవసరంగా జయపురలో దింపిన పైలట్‌

జయపుర,నవంబర్‌20(జ‌నంసాక్షి): ఆకాశంలో ప్రయాణిస్తున్న ఓ విమానం తలుపు ఉన్నట్టుండి

తెరుచుకోవడంతో ఆ విమానాన్ని జయపుర విమానాశ్రయంలో అత్యవసరంగా దింపారు. కరాచీకి చెందిన ఓ ప్రైవేటు ఎస్‌ఆర్‌-20 విమానం లఖ్‌నవూ నుంచి కరాచీ వెళ్తుండగా ఈ పరిణామం జరిగినట్లు విమానాశ్రయవర్గాలు తెలిపాయి. మంగళవారం ఉదయం లఖ్‌నవూ నుంచి బయలుదేరిన విమానం తలుపులు కొంత సేపటికి తెరుచుకున్నట్లుగా పైలట్‌కు సూచిక కనిపించిందని, వెంటనే ఆయన అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరాడని చెప్పారు. జయపుర విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయిందని, విమానాశ్రయ భద్రతా సిబ్బంది తనిఖీల అనంతరం మళ్లీ కరాచీకి పయనమైందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారం ఈ ఘటన గురించి రాష్ట్ర నిఘా వర్గాలకు సమాచారం అందించినట్లు వారు వెల్లడించారు.