కరుణానిధి మహత్తర రాజకీయ నేత
ఆయన వల్ల్నే సిఎంలు జెండా ఎగురవేస్తున్నారు
తమిళ రాజకీయాల్లో ఆయనది చెరగని ముద్రన్న కెసిఆర్
మండలి ఘనంగా నివాళి
హైదరాబాద్,సెప్టెంబర్ 27(జనంసాక్షి): తమిళనాడు దివంగత మాజీ సీఎం కరుణానిధిది దేశ రాజకీయాల్లో
ప్రత్యేక పాత్ర అని సీఎం కేసీఆర్ కొనియాడారు. ప్రజలు సొంతంగా డబ్బులు చందాగా వేసుకుని కరుణానిధి సభలను పెట్టేవారని అన్నారు. అంతటి మహత్తర నేత అని అన్నారు. శాసనమండలిలో కరుణానిధి మృతిపట్ల కేసీఆర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. 17 ఏళ్ల వయసులోనే కరుణానిధి రాజకీయాల్లోకి వచ్చారు. కరుణానిధి గొప్ప కళాకారుడు, రచయిత, మంచి రాజకీయ వేత్త. నాస్తిక ఉద్యమానికి ఆకర్షితులై కరుణానిధిగా పేరు మార్చుకున్నారు. సినిమా రంగంలోనూ కరుణానిధి అద్భుతంగా రాణించారు. ఆయన స్క్రిప్టు రాసిన ప్రతీ సినిమా సూపర్‌హిట్ అయిందని కేసీఆర్ గుర్తు చేశారు. తమిళనాడు ప్రజలు కరుణానిధిని గౌరవంగా కలైజ్ఞర్ అని పిలుచుకునేవారు. అటు సినిమా రంగమైనా, ఇటు రాజకీయాల్లోనే కరుణానిధి అద్భుతంగా రాణించి ప్రశంసలు అందుకున్నారు. కరుణానిధికి ప్రజల్లో గొప్ప అభిమానం ఉంది. ఉద్యమాలకు ఆయన పాటలు రాశారు. సినిమా రంగం నుంచి రాజకీయ రంగం వైపు వచ్చిన కరుణానిధి అంచెలంచెలుగా ఎదిగారు. డీఎంకే పార్టీకి 49 ఏండ్లు అధ్యక్షుడిగా ఉన్నారు కరుణానిధి. ఆరు దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా కొనసాగారు. ఒకానొక దశలో డీఎంకే పార్టీ నేతలు మొత్తం ఓడిపోయినా కూడా కరుణానిధి ఒక్కరు మాత్రమే గెలిచారు. దీంతో ప్రజల్లో ఆయనుకున్న అభిమానం అర్థమవుతుంది. కరుణానిధి కృషి వల్లే ముఖ్యమంత్రులు ఆగస్టు 15న జాతీయ జెండా ఎగురవేస్తున్నారు. 60 ఏళ్ల రాజకీయ జీవితంలో కరుణానిధి ఎమ్మెల్యేగా ఒక్కసారి కూడా ఓడిపోలేదు. తమిళనాడులో మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన ఘనత కరుణానిధిదే. అనేక విషయాల్లో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి కోసం కృషి చేశారు. నీతి ఆయోగ్ సమావేశాల్లో సమాఖ్యస్ఫూర్తిని ప్రస్తావిస్తూ కరుణానిధి పేరును గుర్తు చేశాను. వాజపేయి, కరుణానిధి మంచి వక్తలు. నమ్మిన సిద్దాంతం కోసం జీవితాంతం నిలబడ్డ ఏకైక వ్యక్తి కరుణానిధి అని సీఎం తెలిపారు. కరుణానిధి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.