కరుణానిధి మృతి పట్ల పార్లమెంటు సంతాపం

ఉభయసభలు నేటికి వాయిదా

– మాజీ సీఎం మృతికి ఉభయసభలు వాయిదా వేయడం తొలిసారి

న్యూఢిల్లీ,ఆగస్టు8(జ‌నం సాక్షి): తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మృతి పట్ల పార్లమెంటు సంతాపం వ్యక్తం చేసింది. బుధవారం పార్లమెంటు ఉభయసభలు ప్రారంభమైన వెంటనే సభ్యులు కరుణానిధికి నివాళులర్పించారు. రాజ్యసభలో ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు, లోక్‌సభలో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సంతాప తీర్మానాలు చదివి వినిపించారు. ఆ తర్వాత సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించారు. అనంతరం ఉభయసభలు గురువారానికి వాయిదా పడ్డాయి. ఈ సందర్భంగా పలువురు ఎంపీలు కరుణానిది తమిళనాడుకు, దేశానికి చేసిన సేవలను కొనియాడారు. రాజకీయ చతురత కలిగిన వ్యక్తి, గొప్ప ధీశాలి అని, అలాంటి వ్యక్తిని కోల్పోటం బాధాకరమని పలువురు ఎంపీలు వ్యాఖ్యానించారు.ఇదిలా ఉంటే కరుణానిధి.. రాజ్యసభ లేదా లోక్‌సభకు ఎప్పుడూ ఎంపిక కాలేదు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా.. ఉభయ సభలు.. ఒక మాజీ సీఎం మృతి పట్ల పార్లమెంట్‌ను వాయిదా వేయడం ఇదే మొదటిసారి. రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు, స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, పార్లమెంటరీ శాఖ మంత్రి అనంత్‌ కుమార్‌, ఇతర ఫ్లోర్‌ లీడర్లు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశరాజకీయాల్లో కరుణానిధి ఓ గొప్ప నేత అని, ఆయన మృతికి నివాళిగా పార్లమెంట్‌ను వాయిదా వేస్తున్నట్లు కమిటీ పేర్కొన్నది.

కరుణానిధికి టీడీపీ ఎంపీల నివాళి…

డీఎంకే అధినేత కరుణానిధి మృతిపట్ల టీడీపీ ఎంపీలు సంతాపం తెలిపారు. బుధవారం టీడీపీపీ కార్యాలయంలో కరుణానిధి చిత్రపటానికి నివాళులర్పించారు. ఇందులో భాగంగా టీడీపీ ఎంపీలు రెండు నిమిషం పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా తమిళనాడుకు, దేశానికి కరుణానిధి చేసిన సేవలను ఎంపీలు కొనియాడారు.