కర్తార్‌పూర్‌ కారిడార్‌ సరికాదు: స్వామి

న్యూఢిల్లీ,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): కర్తార్‌పూర్‌ కారిడార్‌పై బీజేపీ సీనియర్‌ నేత స్వామి తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టారు. కర్తార్‌పూర్‌ కారిడార్‌ ఒక ప్రమాదకరమైన నిర్ణయమని అన్నారు. కేవలం పాస్‌పోర్ట్‌ చూపిస్తే సరిపోదని, సరైన తనిఖీలు లేకపోతే కారిడార్‌ ఏర్పాటును దుర్వినియోగం చేసే అవకాశాలు ఉంటాయని అన్నారు.సోమవారంనాడిక్కడ విూడియాతో ఆయన మాట్లాడుతూ, రూ.250 పెడితే చాందినీ చౌక్‌లో కూడా పాస్‌పోర్ట్‌ పొందవచ్చన్నారు. ప్రజలు ఆరు నెలలకు ముందే రిజిస్టర్‌ చేసుకునేలా చూడాలని, పాకిస్థాన్‌ నుంచి ప్రజలను ఇక్కడికి రావడానికి అనుమతించ కూడదని స్వామి సూచనలు చేశారు. కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవానికి రావాలంటూ పాకిస్థాన్‌ చేసిన ఆహ్వానం మేరకు ఇద్దరు మంత్రులను పంపాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపైనా ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ తన మంత్రులను పాక్‌ పంపకుండా ఆపుతారనే తాను అనుకుంటున్నట్టు చెప్పారు.