కర్నాటకలో నాయకత్వం మార్పునకు అధిష్టానం మొగ్గు

సదానంద ఔట్‌.. షెట్టర్‌ ఇన్‌
11న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ, జూలై 7 (జనంసాక్షి):
కర్నాటకలో నాయకత్వం మార్పునకు రంగం సిద్ధమైంది. మాజీ మంత్రి యడ్యూరప్ప ఒత్తిడికి అధిష్టానం తలొగ్గింది. ముఖ్య మంత్రి సదానందగౌడ్‌ను మార్చేం దుకు బిజెపి కోర్‌ కమిటీ నిర్ణయిం చింది. శనివారంనాడు నగరంలోని బిజెపి అధ్యక్షుడు గడ్కారి నివాసం లో జరిగిన కోర్‌ కమిటీ ఈ మేరకు నిర్ణయించింది. గౌడ స్థానంలో యడ్యూరప్ప వర్గానికి చెందిన జగదీష్‌ షెట్టర్‌ను నియమించాలని కమిటీ తీర్మానించింది. ముఖ్యమంత్రి సదానందగౌడను ఢిల్లీకి రావాల్సిందిగా అధిష్ఠానం ఆదేశించింది. శనివారం సాయంత్రం సదానంద గౌడ తన పదవికి రాజీనామా చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. బిజెప పార్లమెంటు బోర్డు సమావేశం నాయకత్వ మార్పును ఆమోదించేందుకు ఆదివారంనాడు జరగనున్నది. సదానందగౌడను పదవి నుంచి తప్పించాలంటూ మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఎప్పటి నుంచో డిమాండు చేస్తున్నారు. ఆయన స్థానంలో తన అనుయాయి జగదీష్‌ షెట్టర్‌ను కూర్చోబెట్టాలని ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. 2011 ఆగస్టులో యడ్డిపై వచ్చిన ఆరోపణలతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి కొందరు ఎమ్మెల్యేల మద్దతుతో ఆయన సదానందగౌడను తప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూ వచ్చారు. గౌడ రాజీనామాతప్పదనే సంకేతాలు బుధవారం నుంచే హల్‌చల్‌ చేశాయి. 11 నెలల కాలంలో తాను చేసిన ప్రజా ఉపయోగ పనులు, అభివృద్ధి, తన హయాంలో సాధించిన విజయాలను గౌడ ప్రముఖంగా అధిష్టానానికి వివరించినప్పటికీ ఆయన పదవి నుంచి వైదొలగక తప్పలేదు. యడ్యూరప్ప వర్గానికి చెందిన తొమ్మిది మంది మంత్రులు రాజీనామా చేయడంతో కర్నాటక రాజకీయం సంక్షోభంలో పడింది. అయితే అధిష్టానం జోక్యం చేసుకుని వారిని బుజ్జగించడంతో వారు తమ రాజీనామాలను ఉపసంహరించుకున్నారు. అయితే సదానందగౌడను తప్పిస్తామనే హామీతోనే ఈ ఉప సంహరణ జరిగిందని అంటున్నారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన యడ్డి వర్గీయులు గౌడ పదవి నుంచి దిగడం ఖాయమని, షెట్టర్‌కు పదవి దక్కుతుందనే ప్రచారం ప్రారంభించారు. వీరంతా తరచూ యడ్యూరప్ప నివాసంలో మంతనాలు జరిపారు. రాష్ట్రపతి ఎన్నికలు పూర్తయిన తరువాత నాయకత్వ మార్పు ఉంటుందని తొలుత అధిష్టానం చెప్పినప్పటికి ఈ నెల 16 నుంచి కర్నాటక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న దృష్ట్యా నాయకత్వ మార్పును ఆ లోపే జరపాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా తాను ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగాల్సిన పరిస్థితి ఏర్పడడంతో సదానందగౌడ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. యడ్యూరప్ప తన నాయకుడు.. కార్యకర్తగా ఆయన చెప్పిన మాట నేను వినాల్సిందే.. ఆయన చెప్పింది పాటిస్తా.. అని అన్నారు. ఇక కర్నాటకను దేవుడే కాపాడాలి అన్నారు. బిజెపి అధిష్టానం నిర్ణయమే తనకు శిరోధార్యమన్నారు. అయితే కర్నాటకలో నాయకత్వ మార్పునకు బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ విముఖత వ్యక్తం చేయడంతో ఇప్పటి వరకు జాప్యం జరిగింది. అయితే యడ్యూరప్ప వర్గం అధిష్టానంపై ఒత్తిడి పెంచడంతో నాయకత్వ మార్పు అనివార్యమైంది. ఈ నెల 9న గాని, 11న గాని జగదీష్‌ షెట్టర్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈసారి ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా ఏర్పాటు చేయాలని అధిష్టానం భావిస్తున్నట్టు భోగట్టా. ఉప ముఖ్యమంత్రి పదవికి మంత్రి ఆర్‌.అశోక్‌ గాని లేక రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఈశ్వరప్పను గాని నియమించవచ్చని తెలుస్తోంది.