కళంకిత మంత్రులను సాగనంపండి
సోనియాకు శంకర్‌రావు వినతి
న్యూఢిల్లీ, ఆగస్టు 23 : దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాలో ఇబ్బందులు పడిన కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలకు తగిన గుర్తింపును ఇవ్వాలని మాజీ మంత్రి శంకరరావు గురువారం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి విజ్ఞప్తి చేశారు. శంకరరావుకు చాలా రోజులు తర్వాత సోనియా అపాయింట్‌మెంట్ దొరికింది. ఆమెతో భేటీ అయిన శంకరరావు పలు విషయాలను సోనియా దృష్టికి తీసుకువెళ్ళారు. ఏఐసిసి ప్రధానకార్యదర్శి రాహుల్ గాంధీని ప్రధానమ్తంరిని చేసేందుకు పార్టీని బలోపేతం చేయాలని, కార్యకర్తలకు గుర్తింపునివ్వాలని శంకర్‌రావు కోరారు.
అదే సమయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రవాణా శాఖ మంత్రిపైనా సోనియాకు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపి వైయస్ జగన్మోహన్‌రెడ్డి కోవర్టుగా మారి అతనిని రక్షిస్తున్నారని, ధర్మాన ప్రసాదరావు రాజీనామాను ఆమోదించవద్దని కూడా ఆమెను కోరారని సమాచారం. అంతకుముందు శంకరరావు ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి నారాయణ స్వామిని కలిశారు.
పలువురు మంత్రులపై ఫిర్యాదు చేశారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని సిబిఐ ఎందుకు విచారించడం లేదని, సిబిఐ పక్షపాత వైఖరిపై చర్యలు తీసుకోవాలని నారాయణస్వామిని కోరారు. భేటీ అనంతరం శంకరరావు మాట్లాడుతూ.. ఓబుళపురం మైనింగ్ కేసులో సిబిఐ పక్షపాతంగా వ్యవహరిస్తోందని, సబితను సిబిఐ ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. వాన్‌పిక్ కేసులో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణని అరెస్టు చేసిన సిబిఐ ఓఎంసి కేసులో భిన్నంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సిబిఐ పక్షపాత వైఖరిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. ఇప్పటికే ఆయన ఈ విషయంలో సిబిఐపై సివిసికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు సోనియాతో పలువురు రాష్ట్ర నేతలు భేటీ అయ్యారు. పిసిసి ప్రధాన కార్యదర్శి గౌరీ శంకర్… సోనియాను కలిసి నామినేటెడ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ఛైర్మన్ ఎం.సత్యనారాయణ కలిసి పార్టీ బలోపేతంపై సోనియాకు పలు సూచనలు చేశారని తెలుస్తోంది.