కవితకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
` ఢల్లీి లిక్కర్ స్కామ్‌లో విచారణ నవంబర్ 20 వరకు వాయిదా..
` సమన్లు జారీచేయొద్దని ఈడీకి ఆదేశం
న్యూఢల్లీి(జనంసాక్షి):ఢల్లీి లిక్కర్ స్కామ్‌లో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కవితకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. కవిత దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా తదుపరి విచారణను నవంబర్ 20వ తేదీకి వాయిదా వేశారు. అప్పటి వరకూ ఈడీ సమన్లు కూడా జారీ చేయవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈడీ విచారణ ఎదుర్కొనే అంశంలో కవితకు ఊరట లభించినట్లయింది. గత విచారణ సందర్భంగా ఈడీ ముందు మహిళల హాజరు అంశంపై కౌంటర్ అఫిడవిట్ దాఖలకు 10 రోజుల సమయం కోరింది ఈడీ. దీంతో కవితకు 10 రోజులపాటూ నోటీసులను వాయిదా వేసింది ఈడీ. ఇప్పుడు మరోసారి నవంబర్ ఇరవయ్యో తేదీ వరకూ వాయిదా వేయడానికి అంగీకరించింది.
గతంలో లిక్కర్ కేసులో ఈడీ నోటీసులు అందుకున్న కవిత.. ఈడీ కార్యాలయంలో విచారణకు హారజయ్యారు. అయితే.. ఈడీ కార్యాలయంలో మహిళల విచారణ సీఆర్సీసీకి విరుద్ధం అంటూ ఆమె మొదటి నుంచి వాదిస్తున్నారు. నళిని చిదంబరం తరహాలో ఇంటివద్దే తనను విచారణ జరపాలని ఆమె కోరుతున్నారు. ఈ క్రమంలో దర్యాప్తు సంస్థల తీరును తప్పుబడుతూ ఆమె సుప్రీంలో పిటిషన్ వేశారు.ఆ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది. అయినప్పటికీ ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. తన పిటిషన్ విచారణలో ఉండగా.. నోటీసులు ఎలా జారీ చేస్తారని ఈడీ తీరును ప్రశ్నించారామె. అంతే కాదు తాను విచారణకు రాలేనని ఈడీకి స్పష్టం చేశారు. కవిత బిజీగా ఉంటే నోటీసుల విషయంలో పది రోజుల సమయం పొడగిస్తామని గత విచారణలో ఈడీ కోర్టుకు తెలిపింది. ఈ క్రమంలో నేటితో పదిరోజుల గడువు ముగిసింది. ఇవాళ్టి విచారణ సందర్భంగా.. కవిత పిటిషన్‌పై విచారణ కొనసాగుతున్నందున తదుపరి విచారణలోపు ఎలాంటి నోటీసులు జారీ చేయొద్దని సుప్రీం కోర్టు, ఈడీకి స్పష్టం చేసింది. సిఆర్పిసి సెక్షన్ 160 ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉల్లంఘించిందని కవిత తరపు న్యాయవాదులు గతంలో వాదించారు. చట్ట ప్రకారం దర్యాప్తు సంస్థలు మహిళను ఇంటి దగ్గరే విచారణ జరపాలని, కానీ వ్యక్తిగతంగా హాజరుకావాలని తనకు సెక్షన్ 50 ప్రకారం నోటీసులు జారీ చేయడం చట్ట విరుద్ధమని కవిత తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. అంతేకాదు వాంగ్మూలం నమోదు చేసేటప్పుడు న్యాయవాది సమక్షంలో వీడియో చిత్రీకరణకు ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును కోరారు. అయితే పీఎంఎల్‌ఏ కేసుల్లోకి సెక్షన్ 160 వర్తించదని ఈడీ తరపు న్యాయవాది పేర్కొన్నారు. పి ఎం ఎల్ ఏ సెక్షన్ 50ని ధర్మాసనానికి వివరించారు. చట్ట ప్రకారం ఎవరినైనా విచారణకు పిలిచే అధికారాలు ఈడికి ఉన్నాయని ఈడి తరపు న్యాయవాది ఎస్వీ రాజు తమ వాదన వినిపించారు. నవంబర్ 20వ తేదీ వరకూ కవితను విచారణ చేయడం లేదా అరెస్టు చేయడం వంటి పరిణామాలు ఉండే అవకాశం లేదు.