కాంగ్రెస్‌లో ఆరని టిక్కెట్ల చిచ్చు
రాహుల్ ఇంటిముందు బండ ధర్నా
డబ్బులకు టిక్కెట్లు అమ్ముకున్నారన్న క్యామ మల్లేశ్
కొత్తగూడెం, రాజేంద్రనగర్‌లో రెబల్స్
నిరాశలోనే పొన్నాల లక్ష్మయ్య
జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణతార కాంగ్రెస్‌కు రాజీనామా
న్యూఢిల్లీ/హైదరాబాద్,నవంబర్15(జనంసాక్షి): మహాకూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్‌లో సీట్ల కేటాయింపు లొల్లి తారస్థాయికి చేరింది. సీట్ల పంచాయతీ కాంగ్రెస్‌లో చిచ్చురేపుతోంది. మహాకూటమిలో సీట్ల పంపకం ఆ పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఈ ఎన్నికల్లో తమకు సీటు దక్కుతుందని భావించిన ఆశావహులకు నిరాశే ఎదురవడంతో వారిలో ఆగ్రహావేశాలు ఉప్పొంగాయి. దీంతో కొందరు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి వేరే పార్టీల్లో చేరుతుండగా.. ఇంకొందరు స్వతంత్రంగా పోటీచేస్తామని హెచ్చరిస్తూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తికరెడ్డి దిల్లీలోని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాసం వద్ద నిరసనకు దిగారు. అలాగే కొత్తగూడెంలో కృష్ణ రెబల్‌గా పోటీలోకి దిగుతానని అన్నారు. సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. కాంగ్రెస్‌లో టిక్కెట్లు అమ్ముకున్నారని రంగారెడ్డి డిసిస అధ్యక్షుడు క్యామ మల్లేశ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇకపోతే జనగామ టిక్కెట్‌పై పొన్నాలకు ఎదురు చూపులు తప్పడం లేదు. నిజామాబాద్ జిల్లా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణతార కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. తనకు టికెట్ కేటాయించక పోవడంతో రాహుల్ నివాసం ఎదుట మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి ధర్నాకు దిగారు. దీంతో కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కుసుం కుమార్ ఆమెతో చర్చలు జరుపుతున్నారు. తన పేరు జాబితాలో ఉన్నా తనను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఎందకు తన పేరు లేదో చెప్పాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సీట్ల కేటాయింపుపై రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ సంచలన ఆరోపణలు చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో దానం నాగేందర్‌ను గెలిపించేందుకే దాసోజు శ్రవణ్‌ను అక్కడ బరిలో దించారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కురుమ, యాదవులను విస్మరించిందని ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్‌లో కురుమ, యాదవ సంఘాల అధ్యక్షులతో కలిసి ఆయన కాంగ్రెస్‌లో జరుగుతున్న అన్యాయాలను విూడియాకు వివరించారు. కాంగ్రెస్‌లో రూ.కోట్లకు సీట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. పార్టీలో కోవర్టులు ఉన్నారని తెలిపారు. ఇబ్రహీంపట్నం టికెట్ కోసం కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ భక్తచరణ్‌దాస్ తనను రూ.3కోట్లు డిమాండ్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. వీటికి సంబంధించినవీడియో టేపులను విడుదల చేస్తామని అన్నారు. రాహుల్ ఆశయానికి విరుద్ధంగా రాష్ట్రంలో టికెట్లు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. పార్టీలో సీనియర్ నేతలకుకాకుండా కొత్త కొత్తవారికి, బంధువర్గానికే సీట్లు ఇస్తున్నారని అసంతృప్తి వ్యక్తంచేశారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు దొంగల ముఠాగా వ్యవరిస్తున్నారనిమండిపడ్డారు. ఇకపోతే మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి రాజీనామా చేశారు. తనకు రాజేంద్రనగర్ టికెట్ కేటాయించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, డివిజన్ అధ్యక్షులు రాజీనామా చేస్తారని తెలిపారు. మహాకూటమి పేరుతో టీడీపీ నేత ఎల్. రమణ టిక్కెట్లు అమ్ముకున్నారని మండిపడ్డారు. రాజేంద్రనగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అయితేనే గెలుస్తారని, రాజేంద్రనగర్‌లో రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయని కార్తీక్ చెబుతున్నారు. టీడీపీకి టికెట్ కేటాయించడంతో కార్యకర్తలు ఆవేదన చెందారని, తమ నిర్ణయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేతిలో పెట్టామని కార్తీక్‌రెడ్డి తెలిపారు. బుధవారం రాజేంద్రనగర్ నుంచి కార్తీక్ నామినేషన్ దాఖలు చేశారు.
ఇకపోతే తమకు అధిష్టానం ప్రజలేనని అందుకే ప్రజలు, కార్యకర్తల అభీష్టం మేరకు పోటీ చేయాల్సి వస్తోందని వరంగల్ కాంగ్రెస్ నేత నాయిని రాజేందర్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఇకపోతే కాంగంరెస్ టిక్కెట్ దక్కకపోవడంతో నిజామాబాద్ జిల్లా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణతార కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. తాను స్వతంత్రంగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.