కాంగ్రెస్‌లో సద్దుమణగని టిక్కెట్ల ఆందోళన

గాంధీభవన్‌ నుంచి మళ్లీ ఢిల్లీకి మారిన వేదిక

న్యూఢిల్లీ,నవంబర్‌12(జ‌నంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ల కోసం నేతలు నానాపాట్లు పడుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీలో టిక్కెట్ల కోసం పోటీ ¬రా¬రీగా సాగుతోంది. కొంతమంది నేతలు హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌ వద్ద ఆందోళనకు దిగగా.. మరికొందరు ఢిల్లీలో స్క్రీనింగ్‌ కమిటీ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. టిక్కెట్ల ఖరారు కోసం సీన్‌ మళ్లీ ఢిల్లీఇకి మారంది.ఇదిలావుండగా మాజీ ఎంపీ రవీంద్రనాయక్‌ టిక్కెట్‌ కోసం వినుత్నంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగా సోమవారం ఢిల్లీలోని రాహుల్‌ నివాసానికి లంబాడి మహిళతో బస్సులో వెళ్లి ఆయనను కలిశారు. తనకు దేవరకొండ టిక్కెట్‌ ఇవ్వాలని రాహుల్‌ వద్ద డిమాండ్‌ చేశారు. తెలంగాణలో అభ్యర్థుల పేర్లు నేడోరేపో తేలే అవకాశం ఉన్నా.. నేతల మాత్రం ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. టీపీసీపీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కుంతియాలు రాహుల్‌తో భేటీ అనంతరం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఓ వైపు.. సొంత పార్టీలో ఆశావహుల ఆందోళనలు మరోవైపు కాంగ్రెస్‌ పార్టీకి తలనొప్పిగా మారాయి. పార్టీ టికెట్‌ ఆశిస్తున్న నాయకుల ఆందోళనలకు గత కొద్దిరోజులుగా గాంధీ భవన్‌ వేదికగా మారింది. తొలి నుంచి పార్టీలో పనిచేసిన వారికే టికెట్‌ కేటాయించాలంటూ పలువురు నాయకుల మద్దతుదారులు గాంధీ భవన్‌ వద్ద తమ నిరసన తెలుపుతున్నారు. సోమవారం ఉదయం నుంచి తెలంగాణలో నామినేషన్ల పక్రియ ప్రారంభమైనప్పటికీ.. కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో పలు సీట్లపై ఆశలు పెట్టుకున్న వారు ఆయా స్థానాలు తమకే కేటాయించాలంటూ గాంధీ భవన్‌ వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రెండు మూడు రోజుల నుంచి ఖానాపూర్‌, మల్కాజ్‌గిరి నియోజవర్గాలకు చెందిన కార్యకర్తలు గాంధీ భవన్‌ వద్ద దీక్ష చేపట్టగా.. సోమవారం వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌ ఆందోళనకు దిగారు. గాంధీ భవన్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో టీపీసీసీ ముందస్తు చర్యలు చేపట్టింది. పోలీసులు సహకారంతో గాంధీ భవన్‌ గేట్లకు తాళాలు వేయించి.. లోనికి ఎవరినీ అనుమతించొద్దని ఆదేశాలు జారీచేసింది.