కాంగ్రెస్‌ అవినీతికి ప్రాజెక్టులపై ప్రభావం

గురుగ్రామ్‌లో వెస్టన్ర్‌ పెరిఫరల్‌ ఎక్స్‌ప్రెస్‌వేకు జెండా

కామన్వెల్త్‌ క్రీడల సమయంలో పూర్తి కావాల్సిందన్న ప్రధాని

చండీఘడ్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ అవినీతికి ప్రాజెక్టులు కూడా ఆలస్యం అవుతున్నాయని, అందుకు హరియాణాలోని గురుగ్రామ్‌లో వెస్టన్ర్‌ పెరిఫరల్‌ ఎక్స్‌ప్రెస్‌వే కూడా ఓకటని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ప్రాజెక్టును సోమవారం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు 2009లో పూర్తి కావాల్సి ఉండగా ఇన్నేళ్ల ఆలస్యం తర్వాత ఇప్పుడు పూర్తయిది. ప్రాజెక్టుకు దాదాపు 15ఏళ్ల సమయం పట్టింది. ఈరోజు బల్లభ్‌గఢ్‌-ముజేసార్‌ మెట్రోను కూడా మోదీ ప్రారంభించారు. కాంగ్రెస్‌ హయాంలోని కామన్‌ వెల్త్‌ క్రీడల కుంభకోణం వల్ల ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఇంత ఆలస్యమైందని మోదీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీపై విమర్శలు గుప్పించారు. కామన్వెల్త్‌ క్రీడల సమయంలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు అని, అయితే ఆ కుంభకోణానికి ఇది కూడా బలైపోయిందని ఆరోపించారు. ఇది ఈ రహదారి కాలుష్య నియంత్రణకు తోడ్పడుతుందని, రవాణా సులువు అవుతుందని, పర్యావరణానికి, ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడుతుందని మోదీ పేర్కొన్నారు. డబ్బు ఎలా వృథా చేయాలో యూపీఏ ప్రభుత్వం చేసే పనులను కేస్‌ స్టడీగా తీసుకొని పరిశీలించొచ్చని మోదీ విమర్శించారు. వారి అవినీతి వల్లే ప్రాజెక్టు ఆలస్యమైందని, ఎంతో డబ్బు వృథా అయిందని అన్నారు. తమ ప్రభుత్వంలో దేశంలో రోజుకు 27కిలోవిూటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోందని, భారతమాల ప్రాజెక్టు కింద 35వేల కిలోవిూటర్ల మేర రహదారులు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. గత 60ఏళ్లలో నిర్మించిన దానికంటే ఎక్కువ హైవేలు ఈ నాలుగేళ్లలో నిర్మించామని చెప్పారు. అలాగే రైల్వే మార్గాలను కూడా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు

ముద్రా యోజన, స్టార్టప్‌ ఇండియా అండ్‌ స్టాండప్‌ ఇండియా పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తామని చెప్పారు. స్వచ్ఛభారత్‌ దేశంలో మహిళల జీవితాలను మార్చేసిందని తెలిపారు. హరియాణాలో ప్రారంభించిన వెస్టన్ర్‌ పెరిఫరల్‌ ఎక్స్‌ప్రెస్‌వేను కుండాలి-మానేసర్‌-పాల్వాల్‌(కేఎంపీ) ఎక్స్‌ప్రెస్‌వేగా పిలుస్తున్నారు. దీనితో దిల్లీ నగరంలో వాయు కాలుష్యం కాస్త తగ్గే అవకాశం ఉంది. దిల్లీ నగరంలోకి వెళ్లాల్సిన అవసరం లేనప్పటికీ దిల్లీ విూదుగా వెళ్లే కమర్షియల్‌ వాహనాలు ఈ ఎక్స్‌ప్రెస్‌వే గుండా వెళ్లొచ్చు. ఈ రహదారి ప్రారంభం కావడంతో నగరంలోకి వెళ్లే వాహనాల సంఖ్య 30శాతం తగ్గుతుంది. దీంతో కాలుష్యం కూడా తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఈస్టన్ర్‌ పెరిఫరల్‌ ఎక్స్‌ప్రెస్‌వే(ఈపీఈ) ఆర్నెల్ల క్రితం ప్రారంభమైంది. ఇప్పుడు వెస్టన్ర్‌ పెరిఫరల్‌ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభంతో లూప్‌ పూర్తయ్యింది. కేఎంపీ ఎక్స్‌ప్రెస్‌వేతో జాతీయ రహదారి-1(పానిపట్‌ వెళ్లేవైపు), జాతీయ రహదారి-10(రోహతక్‌ రోడ్డు), ఎన్‌హెచ్‌-8(మానేర్‌ దగ్గర జైపూర్‌ ఎక్స్‌ప్రెస్‌వే), ఎన్‌హెచ్‌-2(దిల్లీ-ఆగ్రా హైవే) రహదారులు కలుస్తాయి. కేఎంపీ ప్రారంభోత్సవంతో ఈస్టన్ర్‌ పెరిఫరల్‌ ఎక్ర్‌ప్రెస్‌వేపై కూడా ట్రాఫిక్‌ పెరుగుతుందని జాతీయ రహదారులు అథారిటీ భావిస్తోంది. కాగా ఈ ఎక్ర్‌ప్రెస్‌వే కారణంగా దిల్లీలో ట్రాఫిక్‌ కాస్త తగ్గే అవకాశం ఉంది.