కాంగ్రెస్ పార్టీ ఓ దొంగల ముఠా
– రాహుల్ బచ్చా.. ఆ బచ్చాను పట్టుకొని కాంగ్రెసోళ్లు తిరుగుతున్నారు
– గడ్డాలు పెంచుకుంటే అధికారంలోకి వస్తారా?
– ఇప్పుడున్న సీట్లు కూడా కాంగ్రెస్‌కు రావు
– సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు సిద్ధం
– విలేకరుల సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
సంగారెడ్డి, ఆగస్టు29(జనం సాక్షి) : కాంగ్రెస్ పార్టీ ఓ దొంగల ముఠా అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన సంగారెడ్డిలో విలేకరులతో మాట్లాడుతూ… ‘రాహుల్ బచ్చా.. ఆ బచ్చాను పట్టుకుని కాంగ్రెస్ వాళ్లు తిరుగుతున్నారు అంటూ ఘాటుగా విమర్శించారు. అలాగే గడ్డాలు పెంచుకుంటే అధికారంలోకి వస్తారా? అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు ఉన్న సీట్లు వస్తాయో లేదో కాంగ్రెస్ నేతలు చూసుకోవాలని తలసాని సూచించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమని తలసారని అన్నారు. రాయితీపై లక్షల గొర్రెలను ఇవ్వడం దేశ చరిత్రలోనే ప్రథమమని, తెలంగాణ ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా తెరాస ప్రభుత్వం ముందుకు సాగుతుందని వివరించారు. వచ్చే ఏడాది నుంచి కొత్తగా ఏర్పడిన అన్ని జిల్లాల్లో మత్స్య సహకార సంఘాలను ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన కోకాపేటలో యాదవ, ముదిరాజ్ కులాలకు సీఎం భూమిని కేటాయించి నిధులిచ్చారన్నారు. అనేక సంక్షేమ, అభివృద్ధి పనులు రాజకీయాలకు అతీతంగా చేస్తున్నామని తలసాని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు బెంబేలెత్తుతున్నారని, ఎన్నికల్లో ఓట్లు పడవని హైరానా అవుతున్నారన్నారు. నాలుగేళ్లలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ప్రగతిపై చర్చించేందుకే సెప్టెంబర్ 2న ‘ప్రగతి నివేదన’ సభను నిర్వహిస్తున్నామని తలసాని తెలిపారు.



