కాంగ్రెస్ ప్రయత్నాలు ఫలితమిచ్చేనా?
మహాకూటమితో టిఆర్‌ఎస్‌ను ఢీకొనాలన్న వ్యూహం
మోకాలడ్డుతున్న బహుజన కూటమినేత తమ్మినేని
హైదరాబాద్,సెప్టెంబర్8(జనంసాక్షి): తెలంగాణలో ముందస్తుత ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీ మహాకూటమికి సిద్దం అవుతోంది. అంతర్గత కుమ్ములాటలు, ఫిరాయింపులు ఇప్పుడు వెన్నాడుతున్నాయి. ఎవరికి వారు తామే కాబోయే ముఖ్యమంత్రి అన్న భ్రమలో ఉన్నారు. అయినా ఉమ్మడిగా పోరాటం ద్వారా టిఆర్‌ఎస్‌కు చెక్ పెట్టే ప్రయత్నాల్లో ఉంది. కాంగ్రెస్‌ను వెన్నాడుతున్న పాపాలను కప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. అందుకే బలమైన క్యాడర్ ఉన్న టిడిపితో కలసి ముందుకు పోవాలనుకోవడం వ్యూహాత్మక విజయంగా చెప్పుకోవాలి. కాంగ్రెస్,టిడిపి, టిజెఎస్, లెఫ్ట్ పార్టీలతో పాటు మందకృష్ణ,గద్దర్
లాంటి వారిని కలుపుకుని పోయేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాత్రం తను ఏర్పాటు చేసుకున్న బహుజన కూటమిని ఈ ఫ్రంట్‌లో కలపకుండా పోరాడాలని చూస్తున్నారు. కెసిఆర్ పరోక్ష మద్దతుతోనే తమ్మినేని ఇలాంటి విఫల ప్రయత్నాల్లో ఉన్నారన్న నసుగుడు అక్కడక్డకా వినిపిస్తోంది.నిజానికి దేశంలో నాయకత్వ సమస్యలో ఉన్న కాంగ్రెస్ తెలుగు రాష్ట్రాల్లో అంతకన్నా దారుణమైన స్థితిలో ఉంది. తెలంగాణలో అవసరమైతే టిడిపితో పొత్తు పెట్టుకుంటామని కేంద్రమాజీమంత్రి జైపాల్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజం అవుతున్నాయి. తాజాగా రాహుల్‌ను రప్పించడం ద్వారా లబ్ది పొందాలని చూస్తున్నారు. ఎన్నికలకు సమయం మించిపతోఉన్న తరుణంలో పార్టీలో అసమ్మతితో పాటు ఉత్తమ్ నాయకత్వంపై విభేదాలు ఇంకా ఉన్నాయి. ఉన్నాయి. దీనిని అధిగమించేందుకు ఆయన రాహుల్ సభపై ప్రధానంగా దృష్టి పెట్టారు. ఇకపోతే రాష్ట్రవిభజన తరవాత రెండు రాష్ట్రాల్లో ప్రాభవం కోల్పోయిన కాంగ్రెస్ వీధుల్లో పడుతూలేస్తూ గత వైభవం కోసం పాకులాడుతోంది. అనూహ్యంగా ఎన్నికలు రావడంతో ఇప్పటి నుంచే సంచి సర్దుకుంటోంది. తెలంగాణలో ప్రాజెక్టులపై పోరు ప్రధానాంశాలుగా పోరు సాగించిన నేతలు చతికిల పడ్డారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కొట్టుకుని పోయిన కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు ఇప్పటికే పార్టీని వీడారు. తెలంగాణలో టిఆర్‌ఎస్‌ను విమర్శలు చేస్తున్నా పెద్దగా స్పందన కానరావడం లేదు. అందుకే ప్రధానంగా రైతుల సమస్యలను భుజానకెత్తుకున్నారు. దీనికి తోడు రాహుల్ సభ ద్వారా లబ్దిపొందాలని చూస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఇప్ప్పుడు నాయకత్వ సమస్య ఎదుర్కొంటోంది. నాయకత్వం మారితే తప్ప ఫలితం ఉండదని ఇంకొకరు చెబుతున్నారు. సైద్ధాంతికంగా, వ్యూహాత్మకంగా అవసరమైన మార్పులకు సిద్ధపడతామో లేదో తేల్చుకోవాలని మరొకరు సూచిస్తున్నారు. అసలు నాయకత్వం వహించడం మాట వదిలిపెట్టి మళ్లీ కూటమి దిశగా ఎత్తుగడలకు సిద్దపడుతున్నారు.
అందుకే గతాన్ని మరుగునపరచాలనుకున్నవారికి కూడా ప్రస్తుత పరిణామాలు మింగుడు పడటం లేదు. తెలంగాణలో మహాకూటమి ఏ మేరకు ప్రభావం చూపుతుందో కానీ ఓ ప్రత్యమ్నాయం కాగలదన్న భరోసా ఉంది. టిడిపితో పాటు అనేక పార్టీలు కలిస్తే టిఆర్‌ఎస్ కొంతమేరకైనా ఢీకొనవచ్చన్నది ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది.