కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదల


– పదిమందితో జాబితాను విడుదల చేసిన అధిష్టానం
– పొన్నాలకు మళ్లీ మొండి చేయి
– రెండవ జాబితాలో రెడ్లు-6, బీసీ-2, ఎస్సీ-1, ఎస్టీలకు 1 స్థానం కేటాయింపు
న్యూఢిల్లీ,నవంబర్‌14(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదలయ్యింది. రెండో జాబితాలోనూ పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి మర్రి శశిధర్‌ రెడ్డిలకు చోటు దక్కలేదు. అనూహ్యంగా పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కుమార్‌కు ఖైరతాబాద్‌ టిక్కెట్‌ దక్కింది. అలాగే మాజీమంత్రి దివంగత పి.జనార్దన్‌ రెడ్డి తనయుడు విష్ణుకు మరామారు అవకాశం దక్కింది. అలాగే భూపాలపల్లిలో గండ్రకు కూడా టిక్కెట్‌ దక్కింది.  డిసెంబర్‌ 7న సార్వత్రిక ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో  కాంగ్రెస్‌ పార్టీ స్పీడ్‌ పెంచింది. సోమవారం అర్థరాత్రి 65మందితో మొదటి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం బుధవారం ఉదయం 10మంది అభ్యర్ధులతో రెండవ జాబితాను విడుదల చేసింది. విస్తృత సంప్రదింపుల అనంతరం ఎట్టకేలకు మలి జాబితా విడుదలైంది. ఖానాపూర్‌ (ఎస్టీ)లో ఊహించినట్టుగానే రమేష్‌ రాధోడ్‌కు అవకాశం కల్పించారు. ఇక్కడ వ్యతిరేకత వ్యక్తం అయినా ఆయనకే అధిష్టానం మొగ్గు చూపింది.  ఖైరతాబాద్‌లో బీసీ నేత దాసోజు శ్రవణ్‌కుమార్‌వైపు అధిష్టానం మొగ్గుచూపింది. ఇక  ఎల్లారెడ్డి నుంచి జాజల సురేందర్‌కు చోటుదక్కింది. ధర్మపురి (ఎస్టీ) అదూరి లక్ష్మణ్‌ కుమార్‌కు కేటాయించారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి గాయత్రి గానైట్‌ సంస్థల అధినేత గాయత్రి రవికి కేటాయిస్తారని భావించినప్పటికీ అధిష్టానం కందాల ఉపేందర్‌రెడ్డికి కేటాయించింది.  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలేరు స్థానం నుండి బరిలోకి దిగడంతో తుమ్మలను ధీటుగా ఎదుర్కొనే సత్తా స్థానికంగా మంచి పలుకుబడి ఉన్న కందాల ఉపేందర్‌రెడ్డికే ఉంటుందని భావించిన అధిష్టానం ఆయనవైపు మొగ్గు చూపింది.
పొన్నాలకు మొండిచేయి..
ఇదిలా ఉంటే మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పొన్నాల లక్ష్మయ్యకు కాంగ్రెస్‌ అధిష్టానం రెండవ జాబితాలోనూ మొండిచేయి చూపింది. తొలి జాబితాలోనే పొన్నాలకు జనగామ సీటు కేటాయిస్తారని అందరూ భావించినా తొలి జాబితాలో అధిష్టానం పొన్నాలకు షాక్‌ను ఇచ్చింది. దీంతో హుటాహుటీన ఢిల్లీ వెళ్లిన పొన్నాల లక్ష్మయ్య ఢిల్లీలోని పెద్దలతో పాటు, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డితోనూ మాట్లాడారు. దీంతో అనంతరం ఆయన మాట్లాడుతూ.. జనగామ సీటు తనకే వస్తుందని, అధిష్టానం హావిూ ఇచ్చిందని, రెండవ జాబితాలో తన సీటు ఖాయమవుతుందని పొన్నాల సైతం పేర్కొన్నారు. కాగా కాంగ్రెస్‌ అధిష్టానం బుధవారం విడుదల చేసిన రెండవ జాబితాలోనూ పొన్నాలకు చుక్కెదురైంది. కాగా మూడవ జాబితాలోనైనా కాంగ్రెస్‌ అధిష్టానం పొన్నాలకు జనగామ స్థానం కేటాయిస్తుందో లేదా చూడాల్సింది. ఇదిలా ఉంటే ఉప్పటికే 75 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధులను ప్రకటించిన అధిష్టానం రెండవ జాబితాలో ఆరు రెడ్లకు, రెండు బీసీలకు, ఒకటి ఎస్సీ, ఎస్టీలకు కేటాయించారు. తొలి జాబితాలో బీసీలకు 13 స్థానాలు కేటాయించగా, రెండవ జాబితాలో ఇద్దరుకు కేటాయించింది. మరోవైపు ఎస్సీలకు తొలి జాబితాలో 14 మందికి, రెండవ జాబితాలో ఒక్కరికి స్థానం కల్పించింది. మరోవైపు  ఎస్టీలకు మొదటి జాబితాలో ఆరు ఇస్తే రెండవ జాబితాలో ఒకటి కేటాయించారు.
రెండవ జాబితా ఇలా..
ఖానాపూర్‌ (ఎస్టీ)-రమేష్‌ రాథోడ్‌,  ఎల్లారెడ్డి -జాజల సురేందర్‌, ధర్మపురి (ఎస్సీ)-అదూరి లక్ష్మణ్‌ కుమార్‌,
సిరిసిల్ల – కేకే మహేందర్‌ రెడ్డి, మేడ్చల్‌ – కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, ఖైరతాబాద్‌ – దాసోజు శ్రవణ్‌, జూబ్లీహిల్స్‌ – పి విష్ణువర్ధన్‌ రెడ్డి, షాద్‌నగ- సీ ప్రతాప్‌రెడ్డి, భూపాలపల్లి – గండ్ర వెంకట రమణారెడ్డి,
పాలేరు – కాందాల ఉపేందర్‌రెడ్డి