కాంగ్రెస్‌ సర్జికల్‌ దాడులు చేస్తే.. ఉగ్రవాదులకే తెలియలేదు!

– కనీసం భారతీయులకు కూడా చెప్పలేదు
– మేం సర్జికల్‌ దాడి చేస్తే అందరికీ తెలిసింది
– రాజస్తాన్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ
జైపూర్‌, మే3(జ‌నంసాక్షి) : కాంగ్రెస్‌ ప్రభుత్వాలు సర్జికల్‌ దాడులు చేస్తే అది ఉగ్రవాదులకు కూడా తెలియలేదని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. రాజస్‌థాన్‌లోని సికర్‌లో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ పాల్గొని ప్రసంగించారు. పాకిస్థాన్‌ లోని ఉగ్రస్థావరాలు లక్ష్యంగా ఆరుసార్లు సర్జికల్‌ దాడులు చేశామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించడంపై ప్రధాని మోదీ తీవ్రంగా మండిపడ్డారు. ఈ సర్జికల్‌ దాడుల గురించి పాకిస్థాన్‌ కు తెలియలేదనీ, కనీసం సొంత భారతీయులకు కూడా తెలియకుండానే దాడులు జరిగాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్‌ హయాంలో సర్జికల్‌ దాడులు జరిగిన విషయం టెర్రరిస్టులకు తెలియలేదని, వాళ్లపై దాడిచేసిన వాళ్లకు తెలియలేదన్నారు. పాకిస్థాన్‌ కు ఏమాత్రం సమాచారం లేదని, చివరికి సొంత భారతీయులకు కూడా ఈ విషయం తెలియలేదన్నారు. యూపీఏ హయాంలో సర్జికల్‌ స్టెయ్రిక్‌ జరిగినట్లు విూరు(ప్రజలు) ఎప్పుడైనా విన్నారా అంటూ అడిగారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక పాకిస్థాన్‌ లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ చేసిన సర్జికల్‌ దాడులను దేశమంతా చూసిందని మోదీ వ్యాఖ్యానించారు. తాము సర్జికల్‌ దాడులు చేశామని చెప్పగానే ఇలాంటివి రోజూ సైన్యం చేస్తూనే ఉంటుందని కాంగ్రెస్‌ నేతలు వెక్కిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ దేశప్రజలకు తనపై నమ్మకం ఉండటంతో వారంతా తన వెంట నిలబడ్డారని అన్నారు. దీంతో సర్జికల్‌ దాడులకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారనీ, తద్వారా ప్రజలు తనకు మరింతగా దగ్గరయ్యారని తెలిపారు. దీంతో మరో మార్గం లేక మేం కూడా సర్జికల్‌ దాడులు చేశామని కాంగ్రెస్‌ చెప్పుకుంటోందని, దీనివల్ల మోదీపై ఉన్న ప్రేమలో 2-5 శాతం తమకూ దక్కవచ్చని ఆ పార్టీ నేతలు ఆశపడుతున్నారన్నారు. విూటూ.. విూటూ అని
అరుస్తున్నారనిమోదీ కాంగ్రెస్‌ నేతల తీరుపై ఎద్దేవా చేశారు.