కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇళ్లలో ఐటీ సోదాలు
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాసాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి జూబ్లీహిల్స్‌లోని నివాసం, ఆయన స్వస్థలం కొడంగల్‌లోని ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లల్లోనూ ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. నిన్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన రేవంత్‌రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకుని రాత్రికి నేరుగా కొడంగల్ చేరుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ప్రస్తుతం పనివారు తప్ప కుటుంబసభ్యులెవరూ లేరు. అయినప్పటికీ 11 మంది సభ్యులు గల ఐటీ బృందంలో ఆ ఇంటిలో సోదాలు చేస్తోంది.
అటు కొడంగల్‌లోని రేవంత్, ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన రేవంత్‌రెడ్డి ఈరోజు కొడంగల్ నుంచి రాష్ట్రవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించాల్సి ఉంది. ఈరోజు ఉదయం 9-10 గంటల మధ్య ప్రచారం ప్రారంభానికి ఆయన అంతా సిద్ధం చేసుకున్న తరుణంలో ఐటీ దాడులు జరగడం కలకలం రేపింది. ఈ దాడులపై ఆయన ఇంకా స్పందించలేదు.
ముందే ఊహించిన రేవంత్
తన రియల్ ఎస్టేట్ సంస్థను లక్ష్యంగా చేసుకుని ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని రేవంత్‌రెడ్డి కొద్దిరోజుల క్రితమే వ్యాఖ్యానించారు. తనను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ఈ క్రమంలో ఆయనపై ఐటీ దాడులు జరగడం రాజకీయంగా కలకలం రేపింది. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ నేతలపై కుట్రలకు తెరతీస్తోందని నేతలు ఆరోపిస్తున్నారు.