కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
జనం సాక్షి మంథని : చెక్ డ్యాం కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన బగ్గని సుమలత, తన కుమారుడు బక్కని మనోజ్ కుమార్ 2021 సంవత్సరంలో మానేరు వాగుపై నిర్మిస్తున్న చెక్ డాం గుంతల్లో పడి చనిపోవడం జరిగిందని, ఆ సంఘటన జరిగి రెండు సంవత్సరాలు గడుస్తున్నా కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు. ఇప్పటివరకు వారి కుటుంబానికి ఎలాంటి నష్టపరిహారం అందకపోవడం విచారకరమని అన్నారు. కాంట్రాక్టర్ ముందస్తు రక్షణ చర్యలు తీసుకోక పోవడమే ఈ సంఘటనకు ప్రధాన కారణమని, ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మూలంగానే ఈ సంఘటనకు కారణమైందని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, సంఘటనపై సమగ్ర విచారణ జరిపి సంఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం అందించి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. లేని పక్షంలో బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ సిపిఎం పార్టీ పక్షాన, ఇతర రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలతో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో బాధిత కుటుంబ సభ్యులు బగ్గని రవి, బగ్గని రాజేశం, బక్కని మణిదీప్ పాల్గొన్నారు.