కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ రద్దు కావాల్సిందే

విశాఖపట్నం,ఫిబ్రవరి3(జ‌నంసాక్షి): సామాజిక భద్రతను హరించే కంట్రిబ్యూటరీ పింఛను పథకం రద్దు కోసం దేశవ్యాప్త ఉద్యమం నిర్మించాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సమాఖ్య ఏపీటీఎఫ్‌ జిల్లా నాయకులు పేర్కొన్నారు. ప్రపంచంలో అన్నిదేశాల్లో మాతృభాషలో విద్యాబోధన జరుగుతుంటే దీనికి భిన్నంగా మన రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమంలోనికి విద్యాబోధన మార్చేలా ప్రభుత్వం చూస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యను బలహీన పరచి పొరుగుసేవలు, ఒప్పంద పద్ధతుల ద్వారా ఉద్యోగ నియామకాలు చేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం విద్యకు కేటాయించాల్సి నిధులను పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. కేంద్రమే రాష్టాన్రికి పంపే నిధుల్లో కోత విధిస్తోందన్నారు. ఫలితంగా పాఠశాలలో కనీస వసతులు కరవయ్యాయన్నారు. ఇప్పటికే సెకండరీ విద్య కార్పొరేట్‌ శక్తుల చేతుల్లోకి పోయిందన్నారు. ప్రాథమిక విద్య స్వచ్ఛంద సంస్థల చేతుల్లోకి పోతుందన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం బలహీన వర్గాలు, దళితులు, ముస్లింలు, మహిళలను విద్యకు దూరం చేసేదిగా ఉందన్నారు.