కాటేడాన్ పరిశ్రమలు రాకంచర్లకు తరలాల్సిందే
టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు ఆదేశాలు
పారిశ్రామక వాడను పరిశీలించిన బృందం
వికారాబాద్,అగస్టు23(జనంసాక్షి): ఆరు నెల్లలోగా కాలుష్య కాటేదాన్ ఐరన్, స్టీల్ పరిశ్రమలను రాకంచర్లకు తరలించాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.. గడువులోపు స్పందించకపోతే నోటీసులు అందుకున్న పరిశ్రమల భూ కేటాయింపులు రద్దు చేస్తామని టీఎస్ ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా రాకంచర్ల పారిశ్రామిక వాడను సోమవారం టీఎస్ ఐఐసీ చైర్మన్ బాలమల్లు ఆధ్వర్యంలో ఎండీ నర్సింహారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, వికారాబాద్ జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, ఇతర స్థానిక ప్రజాప్రతినిధుల బృందం సందర్శించింది. పార్కులో ఐరన్ ఓర్, స్టీల్ పరిశ్రమలకు కేటాయించిన భూములను, అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు. పార్కులో నడుస్తున్న ఐరన్, స్టీల్ పరిశ్రమలను సందర్శించారు. ఈ సందర్భంగా బాలమల్లు మాట్లాడుతూ.. ఐరన్ ఓర్, స్టీల్ ప్రొడక్ట్స్ పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా నెలకొల్పిన రాకంచర్ల ఇండస్టియ్రల్ పార్కులోకి జీహెచ్ ఎంసీ పరిధిలోని కాలుష్య కారక ఐరన్ ఓర్, స్టీల్ పరిశ్రమలను తరలించాలని 2012 సంవత్సరంలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఇందులో భాగంగా నగరంలోని కాటేదాన్ లో గల 20 ఐరన్ ఓర్, స్టీల్ పరిశ్రమలను రాకంచర్ల పార్కులోకి తరలించాలని వాటి యజమానులకు నోటీసులు ఇచ్చి అక్కడ స్థలాలను కేటాయించినా ఇప్పటివరకు వారు స్పందించలేదన్నారు. ఈ క్రమంలోనే ఇక్కడ నాలుగు కొత్త ఐరన్ ఓర్, స్టీల్ పరిశ్రమలు ఏర్పాటయ్యాయని తెలిపారు. జీహెచ్ ఎంసీ పరిధిలోని కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డుకు వెలుపలికి తరలించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉందన్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇప్పటికే షిప్టింగ్ నోటీసులు అందుకున్న కాటేదాన్ లోని ఐరన్ ఓర్, స్టీల్ పరిశ్రమలను త్వరితంగా రాకంచర్ల ఇండస్టియ్రల్ పార్కులోకి తరలించాలని వాటి యాజమాన్యాలకు టీఎస్ బాలమల్లు ఆదేశించారు. ఆ తర్వాత ఐరన్ ఓర్, స్టీల్ పరిశ్రమల జోన్ గా ఉన్న రాకంచర్ల ఇండస్టియ్రల్ పార్కును జనరల్ కేటగిరి ఇండస్టియ్రల్ పార్కుగా అభివృద్ధి చేసి అన్ని రకాల పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. తద్వారా ఇక్కడ పరిశ్రమల ఏర్పాటులో, వాటిలో ఉద్యోగ, ఉపాధిలో స్థానికులకు పెద్ద ఎత్తున అవకాశాలు లభిస్తాయని ఆయన తెలిపారు.