కార్పోరేట్ స్థాయిలో సచివాలయ కలాపాలు
ఏ రోజు పని ఆ రోజు పూర్తి కావాల్సిందే
నిరంతర పర్యవేక్షణతో మారుతున్న పనితీరు
లోకేశ్ చొరవతో ఐటికి అనుసంధానం
అమరావతి,అక్టోబర్24(జనంసాక్షి): అమరావతి సచివాలయం అమల్లోకి వచ్చి రెండేళ్లు కావడంతో ఇప్పుడు అక్కడంతా ఓ పద్దతిగా కార్యక్రమాలు సాగుతున్నాయి. మరోవైపు అవినీతిని అరికట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఐటిశాఖను చేపట్టిన తరవాత లోకేశ్ ఆఫీస్ వ్యవహారాలన్నీ సజావుగా సాగేలా చూస్తున్నారు. పనులకు సంబంధించి పక్కాగా సామచారం సేకరిస్తున్నారు. అన్ని మంత్రుల కార్యాలయాలను అనుసంధానించారు. దీంతో పనుల కోసం వచ్చే వారు సకాలంలో పనులు చేయించుకుని వెళ్లేలా చూస్తున్నారు. అంతా కంప్యూటరీకరణతో ఏరోజు పని ఆరోజు తేలిపోతోంది. పూర్తి ఆధునిక సాంకేతికత జోడించడంతో పాటు అంతా ఆన్‌లైన్ వ్యవహారాలను నడుపుతున్నారు. ఫైళ్లు పెండింగ్‌లో ఉండకుండా వాటిని సిఎస్ వరకు అనుసంధానం చేయడంతో జాప్యం చేసేందుకు వీలు లేకుండా చేశారు. ఇంతకాలం హైదరాబాద్ సచివాలయంలో కాలక్షేపం కబుర్లతో బాధ్యత నిర్వహించిన ఉద్యోగులకు ఇప్పుడు డ్యూటీ మైండెడ్‌గా ఉండాల్సిన ఆగత్యం ఏర్పడింది. ఎపి సచివాలయంలో క్యాంటీన్ల వద్ద కాలక్షేపం చేసి ఫైళ్లను చూసినా, చూడకున్నా డ్యూటి ముగించుకుని వెళ్లే రోజులు పోయాయి. ఇప్పుడంతా పనితీరు సిసి కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఏరోజు ఏం చేస్తున్నారో కూడా కంప్యూటర్ లెక్క కడుతుంది. సచివాయంలో అడుగుపెట్టింది మొదలు పనిచేసే వరకు అంతా కొలమానం కానుంది. పూర్తి కార్పొరేట్ సంస్ధల తరహాలో నిర్మించిన వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో సవిూకృత భవన నిర్వహణ వ్యవస్థ అమలు చేస్తున్నారు. దాని సాంకేతిక నిర్వహణను సీమెన్స్ కంపెనీకు అప్పగించారు. దీంతో తాత్కాలిక సచివాలయం పనికేంద్రంగా మారింది. ఈ విధానంతో అవినీతి కూడా దూరం అయ్యిందన్న భావన ఉంది. ఫైళ్లను చూసినా చూడకున్నా గతంలో చెల్లేది. కానీ ఇప్పుడలా చేయడానికి లేదు. సచివాలయంలోకి ప్రవేశించే వారికి గుర్తింపు కార్డు తప్పనిసరి చేస్తున్నారు. సీఎం, మంత్రులు, చట్టసభల ప్రతినిధులతో పాటు ప్రభుత్వ శాఖల హెచవోడీలు, ఇతర సాధారణ ఉద్యోగులు సైతం సాధారణ పరిపాలన విభాగం జారీ చేసే గుర్తింపుకార్డు ఉండాలని అధికారులు సూచిన్నారు. కార్డు స్వైప్ చేస్తేనే లోనికి వెల్లడానికి వీలుంటుంది. ఇక ఎంటరయిన దగ్గరినుంచీ సిసి కెమెరాల నిఘాలు పనిచేయాల్సిందే. ఇప్పటికే స్పెషల్ ప్రొటెక్షన ఫోర్స్ కంట్రోల్‌లో ఉన్న సచివాలయంలో అసాధారణ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. పరిపాలనలో వేగం పెరగడం.. మంత్రుల సవిూక్షలు.. సందర్శకుల రాకపోకలు.. వంటి పరిస్థితుల నేపథ్యంలో మూడంచెల భద్రతతో రక్షణ పెంచారు. దీనికితోడుట అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అసెంబ్లీ, శాసనమండలి కూడా ఈ ప్రాంగణంలోనే ఉన్నందున భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసారు. సచివాలయంలోని ప్రతి బ్లాక్‌లోనూ 50పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని బిల్డింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌కు అనుసంధానం చేశారు. అన్ని బ్లాకులతో పాటు ప్రహరీకి నలువైపులా కలిసి మూడొందలకు పైగా సీసీ కెమెరాలుంటాయని సమాచారం. సచివాలయంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా.. ప్రతి ఒక్కరి కదలిక సీసీ కెమెరాల్లో నిక్షిప్తం కానుంది. ఇక సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే ఒకటో బ్లాకుకు ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేసారు. సీఎం చంద్రబాబు జడ్ ప్లస్ క్యాటగిరీలో ఉన్నందున ఆయన కార్యాలయ భద్రతా ఏర్పాట్లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. సీఎం బ్లాకులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సమాచార వ్యవస్థ, కమాండ్ కంట్రోల్ రూమ్, పరిపాలన సౌలభ్యం కోసం డ్వాష్ బోర్డు ఏర్పాటు చేసారు. మొత్తంగా పనితీరు మెరుగు పడిందన్న భావన ఉద్యోగుల్లో కూడా వ్యక్తం అవుతోంది.