కార్మిక కుటుంబాలను రోడ్డున పడేయడం తగదు

వారంతా తెలంగాణ బిడ్డలని గుర్తించాలి: బిజెపి

ఆదిలాబాద్‌,నవంబర్‌19(జనం సాక్షి): రాష్ట్రంలో గత నెలన్నర రోజులుగా దాదాపు 50వేల మంది ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని బిజెపి నేతల పాయల శంకర్‌ విమర్శించారు. కార్మిక కుటుంబాలు రోడ్డున పడి ఆకలితో అలమటిస్తుంటే ప్రభుత్వం ఇలాగాఏ వ్యవహరిస్తుందా అని ప్రశ్నించారు. న్యాయస్థానం చెప్పిన దాన్ని కూడా పట్టించుకోబోమనే పరిస్థితులు కల్పిస్తున్నారన్నారు. స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తపరిచే తెలంగాణ సమాజం నేడు సీఎం కేసీఆర్‌ చేతిలో నలిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం నడవాలంటే ఉద్యోగులు అవసరం. అలాంటిది 50వేల మంది కార్మికులు సమ్మెకు వెళ్తే వారు సెల్ఫ్‌ డిస్మిస్‌ అయ్యారని అంటున్నారు. న్యాయ వ్యవస్థను, ఉద్యోగ వ్యవస్థను గౌరవించే ఆలోచన సీఎంకు రావడం లేదని అన్నారు. అధికారం, అహంకారంతో నియంతలా మారిపోయారు. కార్మికుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని హైకోర్టు పలుమార్లు సూచించినా పట్టించుకోక పోవడం దారుణమన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామ్య రాష్ట్రంగా మారుతుందనుకుంటే నియంత చేతిలో నలిగి పోతున్నదని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ అభ్యుదయ భావాలు కలిగినది. స్వేచ్ఛగా భావాలను వ్యక్తపరిచే సమాజం. అలాంటి సమాజం సీఎం చేతిలో నలిగిపోతోంది. ఇప్పటికైనా హైకోర్టు చెప్పిన సూచనలను పాటించి కార్మికులతో సీఎం చర్చించాలని కోరారు. ఆర్టీసీ కార్మికులు తెలంగాణ బిడ్డలేనని అన్నారు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో వారూ భాగస్వాములే’ అని మరచిపోరాదన్నారు. వారి సమస్యలపై సానుకూలంగా స్పందించాలన్నారు.