కాశ్మీర్‌లోనూ మహాకూటమి

విపక్షాలు ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు

శ్రీనగర్‌,నవంబర్‌21(జ‌నంసాక్షి): జమ్ము కాశ్మీర్‌లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరిచేందుకు మహా కూటమికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌తో పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ(పిడిపి) మెహబూబా ముఫ్తీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఒమర్‌ అబ్దుల్లాలు చర్చించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. మూడు పార్టీల మధ్య చర్చలు తుదిదశలో ఉన్నాయని ఆయా వర్గాలు వెల్లడిస్తున్నాయి. బిజెపిని ఎదుర్కొవడానికి ఇవి ఏకం కానున్నాయి. ఆరు నెలల కేంద్ర పాలన వచ్చే నెలలో ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రంలో బిజెపికి చెక్‌పెట్టడానికి ఓ పెద్ద కూటమి ఏర్పాటు దిశగా పిడిపి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ప్రతిపాదనను కాంగ్రెస్‌ కూడా ఆమోదించింది.

బుధవారం లేదా గురువారం ఈ అంశంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. 87 స్థానాలు గల జమ్మూ, కాశ్మీర్‌ అసెంబ్లీలో పిడిపికి చెందిన 28 మంది, కాంగ్రెస్‌కు చెందిన 12 మంది, నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు చెందిన 15 మంది సభ్యులు ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 44 మంది మెజార్టీ ఉంటే సరిపోతుంది. మహా కూటమిపై బిజెపి విరుచుకుపడింది. వారు విజయవంత కాలేరని బిజెపి నాయకుడొకరు ఆరోపించారు. మూడవ ఫ్రంట్‌ అయిన పీపుల్స్‌ కాన్పరెన్స్‌(పిసి)కు బిజెపి మద్దతునివ్వాలని ప్రయత్నిస్తోంది. కానీ పిసికి ప్రస్తుతం ఇద్దరు శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు. అయితే కాంగ్రెస్‌, పిడిపి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నుండి సభ్యులను చీల్చి మెజార్టీ సాధించాలని బిజెపి ప్రయత్నాలు చేస్తున్నట్లు సూచన ప్రాయమైన వార్తలు వెలువడుతున్నాయి. ఆ దిశగా మంగళవారం పిడిపి నేత, బారాముల్లా పార్లమెంటేరియన్‌ ముజఫర్‌ బేగ్‌ పార్టీని వీడనున్నట్లు వార్తలు వచ్చాయి.