కాశ్మీర్‌ అసెంబ్లీ రద్దు నిర్ణయం సరైనదే

 

రద్దును సమర్థించుకున్న సత్యపాల్‌ మాలిక్‌

గవర్నర్‌ తీరును తప్పుపట్టిన మెహబూబా ముఫ్తీ

శ్రీనగర్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ సమర్థించుకున్నారు. విపక్ష పార్టీలు కూటమి కట్ట ఇప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో అనూహ్యంగా గవర్నర్‌ బుధవారం రాత్రి అసెంబ్లీని రద్దు చేస్తూ సిఫారసు చేశారు.

తన నిర్ణయం సరైనదే అని చెప్పుకొచ్చారు. మెహబూబా ముఫ్తీకి చెందిన పీడీపీతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం నుంచి భాజపా వైదొలిగిన నేపథ్యంలో ఈ ఏడాది జూన్‌ 19 నుంచి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అసెంబ్లీ సుప్తచేతనావస్థలో ఉంది. ‘సాధ్యంకాని కూటమి’కి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వలేనని తెలిపారు. రెండు విరుద్ధమైన రాజకీయ సిద్దాంతాలు గల పార్టీలు కలిసి పనిచేయడం అసాధ్యమని, అలాంటి పార్టీలు కలిసి స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని అన్నారు. కూటమితో ఈ విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం వల్ల ఎమ్మెల్యేలను డబ్బుతో కొనుగోలు చేయడం, నగదు చేతులు మారడం తదితర సమస్యలు తలెత్తుతాయని అన్నారు.

పీడీపీ పార్టీ అధినేత మెహబూబా ముఫ్తీ.. ఈద్‌ సెలవుదినం కంటే ముందే.. తాము ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని లేఖ పంపించాల్సింది అని గవర్నర్‌ పేర్కొన్నారు. అయితే తాను నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని చెప్పేందుకు గవర్నర్‌కు ఫోన్‌ చేస్తే ఎత్తలేదని, ఫ్యాక్స్‌ చేసేందుకు ప్రయత్నిస్తే గవర్నర్‌ కార్యాలయంలోని ఫ్యాక్స్‌ మెషిన్‌లో సాంకేతిక సమస్యతో ఫ్యాక్స్‌ వెళ్లలేదని ముఫ్తీ తెలిపారు. దీంతో ఆమె తన లేఖను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. అయితే ప్రస్తుతం లండన్‌లో ఉన్న పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ నేత సాజద్‌ లోన్‌ గవర్నర్‌కు ఫోన్‌ చేసి భాజపా, ఇతరుల మద్దతుతో తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు. వెంటనే వాట్సాప్‌ ద్వారా గవర్నర్‌కు లేఖను కూడా పంపించారు. ఈ లేఖ అందుకున్న వెంటనే గవర్నర్‌ అసెంబ్లీని రద్దు చేస్తూ లేఖను ఫ్యాక్స్‌ చేశారు. ఇప్పుడు గవర్నర్‌ కార్యాలయంలో ఫ్యాక్స్‌ మెషిన్‌ పనిచేస్తుందా? అని ప్రశ్నిస్తూ మెహబూబా ట్వీట్‌ చేశారు. ఒక్కోసారి రాజ్‌భనవ్‌లో హీటరు కూడా పనిచేయదని గవర్నర్‌ సమాధానమిచ్చారు. కాగా విరోధి పార్టీలైన పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (28), నేషనల్‌ కాన్ఫరెన్స్‌(15)లు ప్రభుత్వం ఏర్పాటు కోసం ఒక్కటయ్యాయి. కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ముందుకొచ్చాయి. అయితే ఇద్దరు సభ్యులున్న పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ నేత సాజద్‌ లోన్‌ కూడా భాజపా(25), ఇతరుల(18)తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ముందుకొచ్చారు. 87మంది సభ్యులున్న జమ్ముకశ్మీర్‌ సభలో 44మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ అసెంబ్లీని రద్దు చేశారు. దీంతో వచ్చే లోక్‌సభ ఎన్నికలతో కలసి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.