కిలోన్నర నుంచి ఐదు కిలోలు..

 

 

స్కూలు బ్యాగులు ఇంతే బరువుండాలి!

న్యూఢిల్లీ: చిన్నారులపై స్కూలు బ్యాగుల మోత తగ్గించే దిశగా కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్ర మానవ వనరుల శాఖ కింద పని చేసే డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ. అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు బోధన, స్కూలు బ్యాగుల బరువుపై మార్గదర్శకాలు జారీ చేసింది. అదనపు పుస్తకాలు, ఇతర మెటీరియల్ తీసుకురావాల్సిందిగా పిల్లలపై ఒత్తిడి తేవొద్దని, స్కూలు బ్యాగుల బరువు పరిమితి కూడా తమ ఆదేశాలకు అనుగుణంగా ఉండాలని ఆ సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. ఒకటి, రెండో తరగతి విద్యార్థుల స్కూలు బ్యాగు బరువు గరిష్ఠంగా 1.5 కిలోలు, 3 నుంచి 5 తరగతి వరకు 2 నుంచి 3 కిలోలు, 6, 7 తరగతులకు 4 కిలోలు, 8, 9 తరగతులకు 4.5 కిలోలు, పదో తరగతి విద్యార్థులకు 5 కేజీల కంటే ఎక్కువ బరువు ఉండకూడదని తమ ఆదేశాల్లో తేల్చి చెప్పింది.

ఇక ఒకటి, రెండు తరగతుల వరకు విద్యార్థులకు హోమ్ వర్క్ ఉండకూడదని కూడా స్పష్టంగా చెప్పింది. అసలు క్లాస్ 1, 2 విద్యార్థులకు భాష, గణితం సబ్జెక్టులు తప్ప మరేమీ ఉండకూడదు. ఇక మూడు నుంచి ఐదో తరగతి వాళ్లకు భాష, ఈవీఎస్, గణితం సబ్జెక్టులు ఉండాలని ఆ సర్క్యులర్‌లో చెప్పారు. నిజానికి డిజిటల్ క్లాస్‌రూమ్స్‌ను ప్రోత్సహించడం ద్వారా విద్యార్థులపై పుస్తకాల భారాన్ని తగ్గించాలని మానవ వనరుల శాఖ మంత్రి ప్రకావ్ జవదేకర్ ఎప్పటి నుంచో చెబుతున్నారు. కోర్టులు కూడా స్కూలు బ్యాగుల బరువుపై ఎన్నోసార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా పలు ఆదేశాలు జారీ చేసింది. బాంబే, మద్రాస్ హైకోర్టులు ఆయా రాష్ర్టాలలో ఈ ఆదేశాల అమలుపై ఆరా తీశాయి. ఇక ప్రతి స్కూల్లో ఎన్సీఈఆర్టీ బుక్స్‌ను కూడా తప్పనిసరి చేయాలని ఈ తాజా సర్క్యులర్ స్పష్టం చేసింది.