కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు
ముంబయి: దేశీయ మార్కెట్లకు మళ్లీ అమ్మకాల సెగ తగిలింది. అంతర్జాతీయ బలహీన సంకేతాలతో పాటు చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో ఆ రంగాల షేర్లు డీలా పడ్డాయి. మార్కెట్ ఆద్యంతం మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో బుధవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు కుప్పకూలాయి. సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా పతనమవగా.. నిఫ్టీ కూడా భారీ నష్టాన్నే చవిచూసింది.
ఈ ఉదయం సూచీలు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 50 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టింది. అయితే చమురు, లోహ, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు మరింత నష్టపోయాయి. ట్రేడింగ్ ఆరంభం నుంచే పతనమవుతూ వచ్చిన సూచీలు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. బుధవారం నాటి సెషన్‌లో సెన్సెక్స్ 306 పాయింట్లు పతనమై 34,345 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 106 పాయింట్ల నష్టంతో 10,430 వద్ద ముగిసింది.
జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలో ఎస్‌బీఐ, టెక్‌మహింద్రా, సిప్లా, యూపీఎల్ లిమిటెడ్, ఎల్‌అండ్‌టీ షేర్లు లాభపడగా.. హిందుస్థాన్ పెట్రోలియం, వేదాంతా లిమిటెడ్, టాటాస్టీల్, భారత్ పెట్రోలియం, ఓఎన్‌జీసీ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. తమిళనాడులోని తూత్తుకుడిలో స్టెరిలైట్‌కు వ్యతిరేకంగా ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో వేదాంతా షేర్లు 7శాతం వరకు నష్టపోయాయి.