కుళ్లు రాజకీయాల్లోకి రాను

రాజకీయ పార్టీని స్థాపించను : అన్నా
న్యూఢిల్లీ , ఆగస్టు 2 (జనంసాక్షి):కుళ్లు రాజకీయాల్లోకి తాను రానని, రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన తనకు లేదని అన్నాహజారే స్పష్టం చేశారు. బలమైన లోక్‌ పాల్‌ తమ పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు. బలమైన లోక్‌పాల్‌ కోసం అన్నాహజారే చేపట్టిన దీక్ష గురువారం అయిదో రోజుకు చేరుకుంది. అన్నా బృందం సభ్యులు చేపట్టిన దీక్ష తొమ్మిదో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అన్నా మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫళమైందని, అందుకే ప్రజలు తమనుంచి రాజకీయ ప్రత్యా మ్నాయం ఆశిస్తున్నారనీ ఆయన అన్నారు. రాజకీయ పార్టీ పెట్టడంలో తప్పులేదనీ, దాని ద్వారానే ప్రజాప్రతినిథులు పార్లమెంట్‌కు ఎన్నికవుతారన్నారు. అయితే తాను మాత్రం కుళ్లు రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని, తనకు రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోకి రానని, బయటనుండే బలమైన లోక్‌పాల్‌ కోసం పోరాడుతానన్నారు. బలమైన లోక్‌పాల్‌ బిల్లు కోసం ప్రభుత్వం సుముఖంగా లేదని విమర్శించారు. బలమైన లోక్‌పాల్‌ వల్ల ప్రభుత్వంలో ఉన్న అవినీతి పరులు జైలుకెళ్లాల్సి వస్తుందనే ఉద్ధేశ్యంతోనే ప్రభుత్వం దీనిని ఆమోదింపచేసుకొనేందుకు ప్రయత్నించడం లేదన్నారు. గురువారం రక్షాబంధన్‌ పండుగను పురస్కరించుకొని మహిళలు, చిన్నారులు అన్నాకు ,ఆయన టీంకు రాఖీలు కట్టారు. మరోవైపు ప్రభుత్వం దిగిరాక పోతే ఏం చేయాలన్న దానిపై అన్నా బృందం చర్చలు జరుపుతోంది. బుధవారం పుణేలో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో అన్నా దీక్షా శిబిరం వద్ద కట్టుదిట్టమైన భద్ర ఏర్పాటు చేశారు. అయితే శుక్రవారం తన దీక్ష విరమించనున్నట్లు అన్నా తెలిపారు.