కూటమి నుంచి కోదండరామ్‌ వైదొలగేలా పొగ?

 

సీట్లు కోల్పోతామనుకుంటున్న వారి తెరచాటు యత్నాలు

ఒంటరి పోరుతో నష్టం లేదంటూ ప్రచారం

కాంగ్రెస్‌ గెలుపు కాయమంటూ లీకులు

హైదరాబాద్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): మహాకూటమిలో పొత్తులు కొనసాగుతాయా? కోదండరామ్‌ కలసి సాగుతారా? లేక సొంతంగానే ముందుకు పోతారా? కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ సూచనలకు భిన్నంగా కొందరఉ కాంగ్రెస్‌ నేతలు ఎక్కడ తమకు టిక్కెట్లు రావో అన్న భయంతో కోదండరామ్‌తో పొత్తును వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. సిపిఐకి రెండు మూడు సీట్లతో సరిపుచ్చి, కోదండరామ్‌ను కూటమినుంచి వైదొలగేలా చేస్తున్నారన్న ప్రచారం ఉంది. ఇది ఎంతవరకు నిజమో కానీ..ప్రస్తు పరిస్థితులు మాట్రం అందుకు అనుకూలంగా ఉన్నాయి. పొత్తులపై తేల్చకుండా కాంగ్రెస్‌ దొంగాటకం ఆడుతోంది. పొత్తుల అంశాన్ని నెలరోజులుగా నానుస్తూ వస్తున్న కాంగ్రెస్‌ వైఖరి పట్ల ఇప్పటికే టీజేఎస్‌, సీపీఐ తమ అసంతృప్తిని,అసహనాన్ని వ్యక్తం చేశాయి. టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ మరో అడుగు ముందుకేసి రెండురోజుల్లో తేల్చకపోతే మొదటి విడతగా తమ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తానని హెచ్చరించి నట్లు వార్తలు వచ్చాయి. పొత్తుల్లో తమకు కేటాయించే సీట్ల సంఖ్య తగ్గితే ఒప్పుకోమని, పార్టీ గుర్తుల విూద పోటీ చేస్తారని సీపీఐ కూడా హెచ్చరించింది. అయినా కాంగ్రెస్‌ పార్టీ స్కీన్రింగ్‌ కమిటీ, కోర్‌ కమిటీ సమావేశాలతోనే కాలం వెల్లుబుచ్చుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. సోమవారం కూడా స్కీన్రింగ్‌ కమిటీతో కోర్‌ కమిటీ భేటీ అయింది. ఇప్పటికే ఖరారు చేసిన జాబితాను ప్రకటించాలని కోర్‌ కమిటీలో నేతలు కోరగా, పొత్తులు ఖరారు కాకుండా అభ్యర్థులను ప్రకటించడం వీలుకాదని స్కీన్రింగ్‌ కమిటీ స్పష్టం చేసినట్లు సమాచారం. మొత్తంగా మహాకూటమిలో సీట్ల సర్దుబాటు అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. తమకు ఎన్ని సీట్లు, ఏయే స్థానాలు కేటాయిస్తారో త్వరగా తేల్చాలని తెలంగాణ జనసమితి(తెజస) కొద్దిరోజులుగా కాంగ్రెస్‌పై ఒత్తిడి తెస్తోంది. మంగళవారం జరిగిన పార్టీ కోర్‌ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌తో తాడోపేడో తేల్చుకోవాలని పార్టీ నేతలు నిర్ణయించారు. మరో రెండ్రోజులే గడువు ఇవ్వాలని తీర్మానించారు. ఈలోగా ఆ పార్టీ నుంచి నిర్ణయం వెలువడకపోతే.. ముందుగా 20 నియోజకవర్గాల్లో తెజస అభ్యర్థుల జాబితా ప్రకటించాలనే నిర్ణయానికొచ్చినట్లు తెలిసింది. తర్వాత కూడా నాన్చుడు ధోరణి ఎదురైతే.. ఒంటరి పోరుకు సన్నద్ధమవ్వాలని సూతప్రాయంగా నిర్ణయానికొచ్చారు. సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌ నుంచి లీకులొస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై తెజస కోర్‌ కమిటీ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. నిన్న మొన్నటివరకూ 8-9 సీట్లను కేటాయిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరగ్గా.. మంగళవారం 3-4 స్థానాలను కేటాయిస్తున్నట్లు కాంగ్రెస్‌ వర్గాల ద్వారా వెల్లడైందంటూ ప్రచారం జరగడంపై తెజస వర్గాలు భగ్గుమన్నాయి. దాదాపు 36 మంది ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతుండగా.. తెజసకు అన్ని సీట్లు వచ్చే అవకాశాలు లేకపోవడంతో సీట్లు రావని ఇప్పటికే తేలిన అభ్యర్థులు కోర్‌ కమిటీ సమావేశంలో అధినేత ఎదుట అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీకి అంతగా బలంలేని చాంద్రాయణగుట్ట, మలక్‌పేట వంటి స్థానాలు కేటాయిస్తామంటూ ప్రచారం చేయిస్తున్నారని కాంగ్రెస్‌పై కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా మహాకూటమి అంటే నచ్చని వారు చేస్తున్న ప్రయత్నాలుగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ ఒంటరిగానే గెలుస్తుందని భావిస్తున్న కాంగ్రెస్‌ నేతలు కొందరు తమ సీట్లకు ఎసరు రాకుండా చేస్తున్న ప్రయత్నాలుగా భావించాల్సి వస్తోంది. మిర్యాలగూడ స్థానాన్ని కోదండరాం స్వయంగా కోరినా.. ఆ స్థానాన్ని ఇవ్వకపోగా కోరుకోని స్థానాలను అంటగట్టాలనుకోవడం సరికాదని తప్పుబట్టినట్లు తెలిసింది. ఈ స్థానాన్ని తెజస నేత విద్యాధరరెడ్డి కోసం పట్టుబడుతుండగా.. కాంగ్రెస్‌ నేత జానారెడ్డి ఇందుకు

అడ్డుతగులుతున్నారని కొందరు విమర్శించినట్లు సమాచారం. మహబూబ్‌నగర్‌ నుంచి రాజేందర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం నుంచి చలమారెడ్డి వెదిరె, తాండూరు నుంచి మర్రి ఆదిత్యరెడ్డి, సూర్యాపేట నుంచి ధర్మార్జున్‌, ఆలేరు నుంచి ప్రభాకరరెడ్డి, ఇదే స్థానం నుంచి అమెరికాలో తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం అధ్యక్షుడు లక్ష్మినర్సింహారెడ్డి(లక్ష్మణ్‌) కూడా ఆశిస్తున్నారు. ఎల్లారెడ్డి నుంచి రచనారెడ్డి, పెద్దపల్లి నుంచి కనకయ్య, స్టేషన్‌ ఘన్‌పూర్‌ నుంచి చింతా స్వామి, మంచిర్యాల నుంచి గురిజాల రవీందర్‌, నర్సంపేట నుంచి అంబటి శ్రీనివాస్‌, ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థి నేతలు రమేశ్‌, ఆశప్ప, ఆంజనేయులు, లింగస్వామిలు సీట్లను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపతోఏ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో చర్చలు జరుపుతూనే.. మరోవైపు తమకు అనుకూల స్థానాలు, గౌరవప్రదమైన సంఖ్యలో సీట్ల సర్దుబాటు జరిగేలా టీపీసీసీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలను తెజస కొనసాగిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌ జాతీయనేత జైరాం రమేశ్‌తోనూ తెజస అధినేత కోదండరాం నేరుగా మాట్లాడారు. అన్ని రకాలుగా ప్రయత్నించాకనే ఒంటరి పోరుపై తుది నిర్ణయాన్ని తీసుకోవాలనీ, అయితే ఎక్కువ కాలయాపన చేయకుండా త్వరితగతిన కార్యాచరణను పూర్తి చేయాలని తెజస కోర్‌కమిటీ అభిప్రాయపడింది. మహాకూటమిలో భాగస్వామ్య పక్షమైన తెలంగాణ జన సమితి (టీజేఎస్‌)కి ఇప్పటిదాకా 8 సీట్లు ఖరారు అయినట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రామగుండం, వరంగల్‌ తూర్పు, మల్కాజిగిరి, మిర్యాలగూడ, అశ్వారావుపేట, సిద్దిపేట, చాంద్రాయణగుట్ట, మలక్‌పేట నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ నుంచి అంగీకారం వచ్చినట్లు తెలుస్తోంది. రామగుండం నుంచి టీజేఎస్‌ అధ్యక్షుడు ఎం. కోదండరాం పోటీ చేయాలని సూతప్రాయంగా నిర్ణయం జరిగింది. మరోవైపు తమకు కనీసం 12 స్థానాల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని కోదండరాం పట్టుబడుతున్నారని తెలుస్తోంది. తమకు చెన్నూరు, ఆసిఫాబాద్‌, దుబ్బాక, షాద్‌నగర్‌ లేదా మెదక్‌ నియోజకవర్గాలను ఇవ్వాలని కోదండరాం గట్టిగా కోరుతున్నట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులను పోటీలో దించడానికి తమకు తగిన సీట్లు కేటాయించాలని ఆయన కోరుతున్నారని తెలియవచ్చింది. సీట్ల సర్దుబాటు పూర్తికాకుంటే భవిష్యత్‌ కార్యాచరణ గురించి నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమైంది.