కూడంకుళం అణు కుంపటి ముట్టడి ఉద్రిక్తత
నిరసనకారులపై పోలీస్ కాల్పులు..
ఒకరి మృతి
కూడంకుళం, సెప్టెంబర్ 10 (జనంసాక్షి): తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. పవర్‌ప్లాంట్‌ను ముట్టడించేందుకు యత్నించిన ఆందోళనకారులపై పోలీసు కాల్పుల్లో ఒకరు మరణించారు. రియాక్టర్లలో యూరేనియం నింపే కార్యక్రమాన్ని నిలిపివే యాలని డిమాండ్ చేస్తూ.. ఆందోళనకారులు నిషేధ ఆజ్ఞలను ఉల్లంఘించి అణు విద్యుత్ కేంద్రాన్ని ముట్టడించేందుకు యత్నించారు. ప్రాజెక్టు పరిసరాల్లోని 500 గ్రామాల ప్రజలు తీర ప్రాంతం, సముద్ర మార్గం ద్వారా ప్రాజెక్టుకు దాదాపు 500 విూటర్ల సవిూపంలోకి చేరుకు న్నారు. అయితే, వెనక్కు వెళ్లిపోవాలని పోలీసులు ఎంతగా కోరినా వారు పట్టించుకోలేదు. యూరేని యం నింపే కార్యక్రమాన్ని నిలిపివేయాలని కోరుతూ అక్కడే భీష్మించుకు కూర్చున్నారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. వెంటబడి మరీ తరిమారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టియర్ గ్యాస్ నుంచి తప్పించుకు నేందుకు నిరసనకారులు సముద్రంలోకి దూకారు. పోలీసుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. పటిష్టమైన భద్రత వర్గాల కన్నుగప్పి నిరసనకారులు సముద్ర మార్గం ద్వారా ప్లాంట్ వద్దకు చేరుకునేందుకు యత్నిస్తుండడంతో.. మరిన్ని భద్రతా బలగాలను రప్పించారు. ప్లాంట్ వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు, ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి జయలలిత జోక్యం చేసుకోవాలని పీపుల్స్ మూవ్‌మెంట్ అగెనెస్ట్ న్యూక్లియర్ ఎనర్జీ కన్వీనర్ ఎస్పీ ఉదయ్‌కుమార్ డిమాండ్ చేశారు. సునావిూ రావడంతో జపాన్‌లోని ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రంలో తలెత్తిన పరిస్థితిని ఎత్తిచూపుతూ.. న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టుల వల్ల తీవ్ర ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. ఆదివారం నుంచే కూడంకుళం ప్రాజెక్ట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడి 1000 మెగావాట్ల మొదటి రియాక్టర్‌లో ఇంధనాన్ని నింపే కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభిస్తామని అధికారులు ప్రకటించడంతో.. చివరి దశ పోరాటానికి సిద్ధం కావాలని ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమకారులు నిర్ణయించారు. ఆదివారం వేల సంఖ్యలో అణుకేంద్రం వైపు దూసుకొచ్చారు. వారు పవర్‌ప్లాంట్ వైపు రాకుండా ఉండేందుకు పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. ప్లాంట్ వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. 2 వేల మందికి పైగా బలగాలను మోహరించారు. అయినా పోలీసుల కళ్లుగప్పి నిరసనకారులు ప్రాజెక్టుకు 500 విూటర్ల సవిూపంలోకి చేరుకున్నారు. ప్రాజెక్టును మూసివేయాలని డిమాండ్ చేశారు. వారితో అధికారులు జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆందోళనకారులు అక్కడే బైఠాయించారు. అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ససేవిూరా అనడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇండో-రష్యా నేతృత్వంలో చేపట్టిన కూడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టులో ఉత్పత్తి గత డిసెంబర్‌లోనే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో అది వాయిదా పడింది.