కెసిఆర్‌కు గుణపాఠం తప్పదు

విమోచనను విస్మరించడంపై నల్లు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌17(జ‌నంసాక్షి): తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లోపించిందని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రజలకు ఇచ్చిన హావిూని మరచారని అన్నారు. కేవలం ఎంఐఎంకు తలొగ్గి చరిత్రను అవమానించడం సరికాదన్నారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఎంఐఎంకు తలొగ్గి తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచారని

విమర్శించారు. నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందిన తెలంగాణ ప్రజలకు సెప్టెంబర్‌-17న నిజమైన స్వాతంత్య్రం వచ్చిన రోజని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేసేవారని అన్నారు. నాలుగేళ్ల పాలనలో ఆయనకా చిత్తశుద్ది లేదని తేలిందని అన్నారు. కేవలం ఓటు బ్యాంకు కోసమే కేసీఆర్‌ విమోచన దినాన్ని నిర్వహించడం లేదని అన్నారు. భారత్‌లో హైదరాబాద్‌ స్టేట్‌ విలీనం తర్వాత దేశ్‌ముఖ్‌లకు వ్యతిరేకంగా పోరాటం చేశామంటున్న కమ్యూనిస్టులు.. అది స్వాతంత్య్ర పోరాటం ఎలా అవుతుందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం, హైదరాబాద్‌ విలీనానికి సంబంధించి తనపై సీపీఐ నేతలు చేసిన విమర్శలపై స్పందించారు. నిజాం వ్యతిరేక పోరాటం జరిపామంటున్న కమ్యూనిస్టులు, నిజాం పాలన లేని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ పోరాటాన్ని ఎందుకు కొనసాగించారో చెప్పాలన్నారు. హైదరాబాద్‌ స్టేట్‌

విలీనం తర్వాత కూడా ఎందుకు పోరాటాన్ని కొనసాగించారనే దానిపై కమ్యూనిస్టుల వద్ద సమాధానం లేదన్నారు. కమ్యూనిస్టుల నుంచి నేర్చుకునే గతి తమకు పట్టలేదని వ్యాఖ్యానించారు.

—–