కేంద్రీయ విశ్వవిద్యాలయ చట్టానికి కేంద్రం సవరణ
న్యూఢిల్లీ: కేంద్రీయ విశ్వవిద్యాలయ చట్టానికి కేంద్రం చేసిన సవరణకు కేంద్ర మంత్రి వర్గం నేడు సవరణకు ఆమోదం తెలిపింది. బీహార్‌లో రెండు కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసేందుకు వీలుగా కేంద్రం ఈ సవరణను చేసింది. బీహార్‌లోని మోతీహరి, గయలలో ఈ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ఒక రాష్ట్రంలో రెండు కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయడం ఇది రెండోసారి. గతంలో ప్రత్యేక పరిస్థితుల క్రింద జమ్మూకాశ్మీర్‌లో ఏర్పాటు చేశారు. గయలో వర్శిటీ ఏర్పాటు చేయాలన్న నిర్ణయం గతంలోనే తీసుకోగా, దీనివల్ల విద్వేషాలు చెలరేగడంతో ముఖ్యమంత్రి, వివిధ పార్టీల నేతలు రెండో విశ్వవిద్యాలయానికి ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ కూడా మోతిహరీలో వర్శిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసింది. ఈ నేపధ్యంలో రెండో కేంద్రీయ వర్శిటీ ఏర్పాటుకు చట్ట సవరణ చేశారు. అయితే కేంద్రం మాత్రం ఒక్క వర్శిటీకి ఇవ్వదల్చుకున్న 240 కోట్లను మాత్రమే ఇవ్వనున్నట్లు, మిగతా నిధులను రాష్ట్ర ప్రభుత్వమే భరించుకోవాలని తెల్పింది.