కేంద్ర ఆర్థిక మంత్రిగా చిదంబరంహోంమంత్రిగా షిండే
న్యూఢిల్లీ, జూలై 31 : కేంద్ర మంత్రి వర్గంలో మంగళవారంనాడు స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు హోంమంత్రిగా వ్యవహరించిన పి. చిదంబరం ఆర్థిక శాఖ మంత్రిగా నియమితులైనారు. ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన ప్రణబ్ ముఖర్జీ, రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా రాజీనామా చేయడంతో ఆర్థిక శాఖ బాధ్యతలను ప్రధాని మన్మోహన్ సింగ్ నిర్వర్తించారు. వచ్చే నెలలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నందున ఆర్థిక శాఖకు పూర్తి బాధ్యతలు నిర్వహించే వ్యక్తి అవసరమున్నందున ప్రభుత్వం మంత్రి వర్గంలో మార్పులు చేపట్టింది. చిదంబరం గతంలో కూడా ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వహించినవారే. హోం శాఖమంత్రిగా ఇప్పటి వరకు విద్యుత్ శాఖ బాధ్యతలు నిర్వహించిన సుశీల్ కుమార్ షిండేను నియమించారు. కార్పొరేట్ వ్యవహారాల శాఖమంత్రి వీరప్ప మొయిలికి విద్యుత్ శాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ స్వల్ప మార్పులపై రాష్ట్రపతి మంగళవారంనాడు సంతకాలు చేశారు.
దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదలను ఎట్టి పరిస్థితుల్లోను ఆమోదించేది లేదని ప్రభుత్వం ప్రకటించిన రోజునే ఆర్థిక శాఖకు పూర్తి స్థాయిలో మంత్రిని నియమించడం గమనార్హం. ఆర్థిక మంత్రిగా చిదంబరం నియామకంతో ఆర్థిక విధానాల్లో మార్పులు ఉంటాయని పలువురు ఆశిస్తున్నారు. ఆర్థిక మంత్రిగా ప్రణబ్‌కు వ్యవహరించిన కాలంలో ఆర్థిక విధానం కుంటుపడిందన్న విమర్శలు ఉన్నాయి. చిదంబరానికి సంస్కరణలకు అనుకూల వాదిగా పేరుంది. ఇది ఇలా వుండగా ఆర్థిక మంత్రిగా చిదంబరం నియామకం పట్ల ప్రతి పక్షాల నుంచి విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉన్నది.
విపక్ష బిజెపి నుంచి చిదంబరం గతంలోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. 2జి స్కామ్‌లో చిదంబరానికి కూడా పాత్ర ఉందంటూ బిజెపి పార్లమెంటులో ఆయన్ని లక్ష్యంగా చేసుకొని బహిష్కరించింది. 2008లో చిదంబరం ఆర్థిక శాఖమంత్రిగా ఉంటూ విపక్షాల నుండి పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయినప్పటికి యుపిఎ ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ, తన పార్టీకే చెందిన వ్యక్తికే మద్దతు ఇస్తూ తిరిగి చిదంబరానికే ఆర్థిక శాఖ పగ్గాలు అప్పగించింది. కాగా ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వహించిన ప్రణబ్ లోక్‌సభాపక్షనేతగా కూడా వ్యవహరించారు. ఆ స్థానంలో హోంశాఖ బాధ్యతలు నిర్వర్తించే సుశీల కుమార్ షిండేను నియమిస్తారని భావిస్తున్నారు. అయితే రెండు దఫాలు ఎంపిగా ఎన్నికైన రాహుల్ గాంధీని లోక్‌సభలో నాయకుడిగా నియమించాలని కాంగ్రెస్ వర్గాలు కోరుతున్నాయి. ఈ విషయమై పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, హోంశాఖ బాధ్యతలు చేపట్టేబోయే షిండే, రాజకీయల్లోకి రాకముందు సబినిస్పెక్టర్‌గా పనిచేయడం విశేషం. ఒక మాజీ పోలీసు అధికారి హోంశాఖమంత్రిగా భాద్యతలు చేపట్టడం ఇదే తొలిసారి.