కేంద్ర మాజీ మంత్రి వీసీ శుక్లా కన్నుమూత

ఢిల్లీ,(జనంసాక్షి): కేంద్ర మాజీ మంత్రి వీసీ శుక్లా కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. మే 26 న ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ నేతలపై మావోయిస్టులు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన శుక్లా ఢిల్లీలో చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. శుక్లా మృతితో ఛత్తీస్‌గఢ్‌ ఘటనలో మృతుల సంఖ్య 29 కి చేరింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అయిన విద్యా చరణ్‌ శుక్లా 1929 ఆగష్టు 2న ఇప్పటి ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో జన్మించారు. 1957 లో తొలిసారి పార్లమెంటుకు ఎన్నికైన శుక్లా 1966 లో ఇందిరాగాంధీ మంత్రివర్గంలో పనిచేశారు. శుక్లా తండ్రి పండిట్‌ రవిశంకర్‌ శుక్లా మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు. వీసీ శుక్లా 9 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.
ప్రధాని సంతాపం
శుక్లా మృతి పట్ల ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సంతాపం తెలిపారు.