కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది ప్రజాకంఠక పాలన – సిపిఐ నేత రామకృష్ణ”

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది ప్రజాకంఠక పాలన – సిపిఐ నేత రామకృష్ణ”

శేరిలింగంప‌ల్లి, జాన్ 03( జనంసాక్షి): దేశంలో రాజకీయాల పేరుతో పూర్తిగా ప్రజావ్యతిరేక విధానాలు కొనసాగుతున్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశ సంక్షేమాన్ని తుంగలోతొక్కి ప్రజాకంటక పాలనను కొనసాగిస్తున్నాయని భారత కమ్యూనిస్టు పార్టీ శేరిలింగంపల్లి మండలకార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఈ మేరకు ఇనార్బిట్ మాల్, మాదాపూర్ ప్రాంతాల సిపిఐ శాఖల మహాసభలను శుక్రవారం మాదాపూర్ దుర్గం చెరువువద్ద ఏర్పాటుచేసిన దరిమిలా మరో సిపిఐ నేత కె. నరసింహారెడ్డి తోకలిసి రామకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను అడ్డుపెట్టుకొని నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియంత పోకడలతో వెళుతూ దేశ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. సామాన్యుడు సంక్షేమాన్ని పట్టించుకునే ప్రజా ప్రతినిధి దేశంలో లేడంటే అది అతిశయోక్తి కాదని, ప్రస్తుత ప్రభుత్వాల పాలన ముమ్మాటికీ దుర్మార్గమైనదేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారీ వ్యవస్థను, దళారీ వ్యవస్థను పెంచి పోషిస్తున్న పాలకులు సామాన్యుడు జీవించేలా కనీస చర్యలు చేపట్టకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నిత్యావసర వస్తువులకుతోడు పెట్రో ఉత్పత్తుల ధరలు మండి పోతున్నాయని, సగటు మనిషి మనుగడ సాధించే పరిస్థితులు ఎక్కడా కనిపించడంలేదని రామకృష్ణ ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాలు పెరిగి తెలంగాణ ప్రజలు ఉజ్వల భవిష్యత్తును సాధిస్తారని వందలాది మంది ఆత్మ బలిదానం చేసుకుని ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తే నేడు ఎంతటి దరిద్రమైన పాలన కొనసాగుతుందో చూడవచ్చు అన్నారు. సామాన్యుడి సంక్షేమం, నిత్యావసర వస్తువుల ధరల తగ్గింపు, తెలంగాణ ప్రజలకు వృద్ధికై ప్రస్తుత పాలకులను గద్దె దింపి మరో అభ్యుదయ పాలనకు శ్రీకారం చుట్టేవరకు భారత కమ్యూనిస్టు పార్టీ తమ ఉద్యమాన్ని ఆపబొదని రామకృష్ణ తదితరులు స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు చందు యాదవ్, అంజి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా శాఖల నూతన కమిటీ కార్యదర్శులుగా శ్రీకృష్ణ, సత్యనారాయణ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.