కేరళలో భారీ వర్షాలు 

– వరదనీటితో పొంగి పొర్లుతున్న వాగుకు, వంకలు
– పలు ప్రాంతాల్లో విరిగిపడిన కొండచరియలు
– 18మంది మృతి, మరికొందరు గల్లంతు
– సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది
తిరువనంతపురం, ఆగస్టు9(జ‌నం సాక్షి) : దక్షిణాది రాష్ట్రమైన కేరళలోని పలు ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురియడంతో పలు ప్రాంతాల్లోని వాగులు, వంకలు వరద నీటితో పొంగిపొర్లుతున్నాయి. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో ఇప్పటివరకూ 18మంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. మరికొందరు గల్లంతయ్యారు. విపత్తు నిర్వహణ వర్గాల సమాచారం ప్రకారం.. గురువారం ఉదయం నుంచి ఇడుక్కీ, మలప్పురం, కన్నూర్‌, వయనాడ్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇడుక్కీ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో 10 మంది మృతిచెందారు. వీరిలో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. ఇక మలప్పురంలో ఐదుగురు, కన్నూర్‌లో ముగ్గురు, వయనాడ్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. పాలక్కడ్‌, కోజికొడె, వయనాడ్‌ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున గల్లంతయ్యారు.
వర్షాల కారణంగా కోజికొడె, వయనాడ్‌ జిల్లాల్లో వరదలు సంభవించాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలయమయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు సహాయకచర్యలు చేపట్టారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని రంగంలోకి దించి సహాయకచర్యలు చేపట్టినట్లు కేరళ సీఎం వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఇదిలా ఉంటే భారీ వర్షాలతో ఇడుక్కీ రిజర్వాయర్‌లో నీటిమట్టం పెరిగిపోయింది. గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో రిజర్వాయర్‌లో నీటిమట్టం 2,398.80 అడుగులకు చేరింది. ఈ డ్యామ్‌ గరిష్ఠస్థాయి 2,403 అడుగులు. దీంతో అధికారులు ఇడుక్కీ డ్యామ్‌ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడిచిపెట్టారు. కేరళలోని ఇడుక్కీ డ్యామ్‌ అతిపెద్ద రిజర్వాయర్‌. అంతేగాక.. ఈ రిజర్వాయర్‌ గేట్లు తెరవడం 26ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే.