కేసీఆర్‌లోకి రజాకార్ల ఆత్మ ప్రవేశించింది
– కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉంది
– ఎంఐఎం ప్రోద్భలంతోనే కేసీఆర్ నాపై అక్రమ కేసులు బనాయించారు
– బీజేపీ తరపున గోషామహల్ నుంచే పోటీ చేస్తా
– విలేకరుల సమావేశంలో బీజేపీ తాజా మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్
– అబిడ్స్ స్టేషన్‌లో విచారణకు హాజరైన రాజాసింగ్
హైదరాబాద్, సెప్టెంబర్17(జనంసాక్షి) : టీఆర్‌ఎస్ కారైతే.. దాని స్టీరింగ్ మాత్రం ఎమ్‌ఐఎమ్ చేతిలో ఉందని, ఎమ్‌ఐఎమ్ ప్రోద్భలంతోనే కేసీఆర్ నాపై అక్రమ కేసులు బనాయించారని బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. గత నెల అనుమతి లేకుండా నగరంలో తిరంగ యాత్ర నిర్వహించినందుకుగాను రాజా సింగ్‌పై కేసు నమోదయిన సంగతి తేలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా సోమవారం రాజా సింగ్ అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. ఇద్దరు న్యాయవాదులతో కలిసి విచారణలో పాల్గొన్న ఆయన ప్రశ్నలన్నింటికి రాత పూర్వక సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. విచారణ అనంతరం బయటకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.. తెలంగాణలో రజాకార్ల పాలన సాగుతుందంటూ మండి పడ్డారు. 50ఏళ్ల క్రితం తుడిచిపెట్టుకు పోయిన రజాకార్ల ఆత్మ మళ్లీ ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌లో ప్రవేశించిందని విమర్శిచారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ కారైతే దాని స్టీరింగ్ మాత్రం ఎమ్‌ఐఎమ్ చేతిలో ఉందని ఆరోపించారు. ఎమ్‌ఐఎమ్ ప్రోత్సాహంతోనే కేసీఆర్ తనపై అక్రమ కేసులు బనాయించారని రాజాసింగ్ మండిపడ్డారు. స్వాతంత్య దినోత్సవం నాడు తిరంగ యాత్ర నిర్వహించినందుకు తనపై కేసులు పెట్టారన్నారు. ఇవన్ని చూస్తే తెలంగాణ పాకిస్తాన్‌లో ఉందో, భారత దేశంలో ఉందో అర్థం కావడం లేదని వాపోయారు. తనను ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా భయపడనని రాబోయే ఎన్నికల్లో కూడా తాను బీజేపీ తరపున గోషామహల్ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన రాజాసింగ్ ఆధ్వర్యంలో నగరంలో తిరంగ యాత్ర జరిగిన విషయం తెలిసిందే. అనుమతి లేకుండా ఆ యాత్ర నిర్వహించినందుకు అతడిపై నగరంలోని ఐదు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విచారణలో భాగంగా తమ ఎదుట హాజరుకావాల్సిందిగా ఆబిడ్స్ పోలీసులు రాజాసింగ్‌కు నోటీసులు జారీ చేశారు.