కొండెక్కిన పూల ధరలు


శ్రావణ మాసం వేళ ధరల పెరుగుదల
హైదరాబాద్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి ): శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి ఇల్లు ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది. ప్రతి ఇంట్లో పూజలు, నోములు, వ్రతాలు శుభకార్యాలతో మార్మోగుతాయి. ఈ శ్రావణంలో ప్రతిరోజూ పూజా కార్యక్రమాలతో పాటు పలు శుభకార్యాలు.. వివాహ ముహూర్తాలు, గృహప్రవేశాలు, నిశ్చితార్థాలు, నూతన వ్యాపార ప్రారంభోత్సవం.. శ్రావణమాసంలో లేదా కార్తీక మాసంలో ఎన్నో శుభకార్యాలు జరుగుతాయి. పువ్వుల ధరలు ఆ స్థాయిలో పెరిగాయి కాబట్టి ఎక్కువ పూల పరిమళాలు వెదజల్లే ఇల్లు ధనవంతుడిలా ఉంటుంది. శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని నగరంలోని పూల మార్కెట్లు కిటకిటలాడాయి. నగరవాసులు తెల్లవారుజాము నుంచే పూల కోసం మార్కెట్లకు పోటెత్తారు. బంతి, చామంతి, కనకాంబర, తామరపూలకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడిరది. ఒక జత రూ.30కి లభించే కమలాలు నేడు దాదాపు రూ.100కి చేరాయి. గత నెల మల్లెలు కిలో రూ.550 ఉండగా ప్రస్తుతం రూ.1500 పలుకుతోంది. తెల్ల చామంతి రూ.200 నుంచి రూ.350, కనకాంబరం రూ.100 నుంచి రూ.300, పసుపు చామంతి రూ.150 నుంచి రూ.400, కలువ రూ.150 నుంచి రూ.500, జాజులు రూ.300 నుంచి రూ. .1,200 పలుకుతుండటంతో శ్రావణ మాసం కావడంతో ప్రజలకు తిప్పలు తప్పడంలేదు. మరోవైపు అమ్మవారికి పూల మాలలకు గిరాకీ ఎక్కువైంది. పూజలో ఉపయోగించే దండలను మరింత అందంగా తీర్చిదిద్ది మార్కెట్‌ లో అందుబాటులో ఉంచారు. అరటి కొమ్మలు, తమలపాకులు, అలంకరణకు ఉపయోగించే అన్ని రకాల పూలను కొనుగోలు చేసేందుకు నగర ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అయితే సామాన్య ప్రజలు ఏ పువ్వుల ధరలు చూసిన అమ్మో.. అనే పరిస్థితి ఏర్పడిరది.