కొంప ముంచిన… సహోద్యోగి కునుకు!

బెర్లిస్‌ : జర్మనీలో ఒక మామూలు బ్యాంకు ఉద్యోగి అతను. అలసిపోయి ఉన్నాడు. అయినా విధి నార్వహణ తప్పదు కదా. పని చేస్తూ చేస్తూ మధ్యలో ఒక్క క్షణం అలా తూలాడంతే.. కంప్యూటర్‌ కీబోర్డు మీద ఒక్కసారి పడాల్సిన 2 అంకె పదకొండు సార్లు పడింది. అసలే బ్యాంకు వ్యవహారం… ఒక అకౌంటులోంచి 62.40 యూరోలను మరో అకౌంటుకు బదిలీ చేసే పనిలో ఉన్నాడతను. ఆ సమయంలోనే నిద్ర ముంచుకొచ్చి కళ్లు మూసుకుపోయాయి. దాంతో కీబోర్డుమీద రెండో అంకె రెచ్చిపోయింది. ఫలితంగా 222,222,222,22 ల యూరోలు ఒక అకౌంట్‌నుంచి మరో అకౌంట్‌కు మారిపోయాయి. పర్యవేక్షణ బాధ్యతల్లో ఉన్న అతని సహోద్యోగి మామూలుగా చూశాడు తప్ప నిశితంగా చూడలేదు. దాంతో పెద్ద మొత్తం డబ్బు మార్పిడి జరిగిపోయింది. అయితే కాసేపటి తర్వాత జరిగిన తప్పు తెలుసుకుని బ్యాంకు సవరించుకుంది. కానీ విధి నిర్వహణలో నిర్లక్ష్యానికి గాను వెరిఫై చేసిన ఉద్యోగిని ఉద్యోగంలోంచి తీసేశారు. దాంతో అతను కోర్టుకెళ్లాడు. తప్పు పూర్తిగా అతనిది కాదు కాబట్టి అతన్ని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని కోర్టు తీర్పు ఇచ్చింది.