కొత్తదంపతులతో కళకళలాడుతున్న తిరుమల

ఉదయం 500 పెళ్లిళ్లు
గదులు దొరక్క సామాన్యుల ఇబ్బందులు
తిరుమల : నిత్యకల్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతున్న తిరుమల క్షేత్రంలో మూడు ముళ్లబంధంతో ఒక్కటి కావడానికి నూతన జంటలు పోటీపడ్డాయి. భక్తకోటితో కిటకిటలాడే దివ్యక్షేత్రం నేడు నూతన వధూవరులతో నిండిపోయింది. ఈ రోజు ఉదయం ముహుర్తంలో 500 వివాహాలు జరిగాయి. సామూహిక వివాహాలు జరిగే పురోహిత సంఘంలో చోటు చాలక వధూవరులు, బంధుమిత్రులు ఇబ్బంది పడుతున్నారు. మఠాలలో వివాహాలు చేసుకునేవారికి గుత్తేదార్ల కారణంగా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ముఖ్యకార్యదర్శి రాంమోహనరావు కుమార్తె వివాహం కోసం ప్రత్యేకంగా మూడెకరాల స్థలాన్ని తితిదే కేటాయించింది. మూడువందల గదులను ముందస్తుగా కేటాయించారు. మిగిలిన గదులను ప్రముఖుల సిఫార్సులు, పైరవీలపై పెళ్లిబృందాలకే కేటాయిస్తున్నారు. స్వామి దర్శనానికి వచ్చిన సాధారణ భక్తులకు గదులు దొరక్క రోడ్లపై సేదతీరాల్సిన పరిస్థితి నెలకొంది.