కొత్త నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ తప్పదు..
నేరస్తులకు వర్ధన్నపేట ఏసిపి శ్రీనివాసరావు హెచ్చరిక
పాలకుర్తి. సెప్టెంబర్ 13 (జనంసాక్షి)
నేరాల అభియోగంలో ఉన్న నేరస్తులు కొత్త నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని వర్ధన్నపేట ఏసీపి సుందరగిరి శ్రీనివాసరావు హెచ్చరించారు. వరంగల్ సి పి డాక్టర్ తరుణ్ జోషి ఆదేశాల మేరకు మంగళవారం మండల కేంద్రంలో గల బషారత్ గార్డెన్ లో పాలకుర్తి సీఐ వట్టే చేరాలు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల రౌడీ షీటర్లకు, కేడీలకు అనుమానితులు, పాత నేరస్తులకు నిర్వహించిన కౌన్సిలింగ్ లో ఏసిపి శ్రీనివాసరావు మాట్లాడుతూ దొంగతనాలు, అత్యాచారాలు, హత్యలకు పాల్పడిన వారు గ్రామాల్లో నేర చరితులుగా ముద్రపడి ఉన్నారని తెలిపారు. వారిలో మార్పును తీసుకురావడానికి పోలీసులు కృషి చేస్తున్నారని వివరించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామాలను సందర్శించి నేరస్తుల ప్రవర్తన పై వివరాలు సేకరించామని అన్నారు. నేరాబీయోగాలతో ఉన్న వ్యక్తులు కొత్త నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీలు, కేడీలుగా అభియోగంలో ఉన్న నేరస్తుల సత్ప్రవర్తన పై పోలీస్ శాఖ నివేదిక రూపొందించి వరంగల్ సీపీకి అందజేస్తామని తెలిపారు. నేరస్తుల్లో సత్ప్రవర్తన, మార్పులు కనిపిస్తే తొలగించేందుకు సిపి పరిశీలిస్తారని సూచించారు. నేరస్తులు మార్పును కోరుకోవాలని ప్రజలతో మమేకమై ఉంటూ ఎలాంటి నేరానికి పాల్పడకుండా సన్మార్గంలో మెదులుకోవాలని సూచించారు. గ్రామాల్లో నేరాల అభియోగంలో ఉన్న ప్రతి నేరస్తుడు సత్ప్రవర్తన కలిగి ఉండేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి, కొడకండ్ల,దేవరుప్పుల ఎస్సైలు తాళ్ల శ్రీకాంత్, యాకూబ్ హుస్సేన్, లక్కర్సు కొమురెల్లి,మునావత్ రమేష్ నాయక్ లతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.