కోర్టు ఏర్పాటు చేసే వరకు జేఏసీ పోరాటం
చేర్యాల (జనంసాక్షి) జులై 23 : చేర్యాలలో జూనియర్ సివిల్ కోర్టు ఏర్పాటు చేసేంత వరకూ పోరాటాలు కొనసాగిస్తామని జేఏసీ చైర్మన్ బైరవబట్ల చక్రదర్ అన్నారు. కోర్టు ఏర్పాటు చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని అంగడి బజారు అంబెడ్కర్ విగ్రహం వద్ద ఒక రోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా చక్రధర్ మాట్లాడుతూ.. కోర్టు విషయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, మంత్రి హరీష్ రావు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారన్నారు. అబద్దాలు చెపుతూ ప్రజలను ఎంతోకాలం నమ్మించలేరని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలకు జిల్లాకోర్టుల విభజన కావటంతో చేర్యాల కోర్టు విషయం ఆటకెక్కిందన్నారు. ఇప్పటివరకు న్యాయశాఖ నుండి ఎలాంటి ప్రతిపాదన ఆర్థిక శాఖ కు, సాధారణ పరిపాలన శాఖకు అందలేదన్నారు. ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని ఒకవైపు హైకోర్టు అధికారులు చెపుతుంటే కోర్టు వచ్చిందని, కొంతమంది ముత్తిరెడ్డి తాబేదార్లు చేర్యాల ద్రోహులు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ఇస్తూ తప్పుదోవ పట్టిస్తున్న వీరిని ప్రజలు క్షమించరని విమర్శించారు. కోర్టు ను తెచ్చి ముత్తిరెడ్డి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ఈ దీక్షలో ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి అందె బీరయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అది శ్రీనివాస్, టీడీపి నాయకులు ఒగ్గు రాజు, సీనియర్ జర్నలిస్ట్ బండ్ల సూర్యం, బహుజన సేవ జిల్లా కన్వీనర్ గద్దల మహేందర్, పిడిఎస్ యూ జిల్లా అధ్యక్షులు రామగళ్ల నరేష్, బీఎస్పీ మండల అధ్యక్షుడు బుట్టి భిక్షపతి, నాగరాజు, దుర్గయ్య, జాక్ నాయకులు నాస్తిక రమేష్, మహేందర్ నాగరాజు, జాక్ శ్రీనివాస్, బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.