కౌలు రైతుకు హక్కులేవీ?
– ప్రైవేటు వడ్డీతో నడ్డీ విరుగుతోంది
– ప్రజా దర్బారులో కోదండరాం
హైదరాబాద్,ఆగష్టు 17(జనంసాక్షి): రుణ అర్హత కార్డులు, వ్యవసాయ రుణాలు, పంట నష్టపరిహారాలు అందకపోవడంతో కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని టీజేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. కౌలు రైతు రక్షణ చట్టం సరిగా అమలుకు నోచుకోకపోవడమే ఇందుకు కారణమని ఆయన చెప్పారు. గురువారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో కోదండరాం ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి గోపాలరావు, ప్రజా సంఘాల నేతలు సీతామహాలక్ష్మి, జీవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం, రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న తరుణంలో కౌలు రైతు రక్షణ చట్టం అమలులో సర్కారు విఫలమైందని మండిపడ్డారు. సేద్యం గిట్టుబాటు కాక అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ఆ తర్వాత బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపుల్లో సైతం తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కౌలు రైతులే కాకుండా దేవాదాయ భూముల సాగు దారులు, పోడు భూములు సాగు చేస్తున్న ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై బాధితులు ప్రజా దర్బార్ దృష్టికి తీసుకొచ్చారు. క్షేత్రస్థాయిలో విస్తరణ వ్యవస్థలు, బ్యాంకు రుణాలు పంపిణీ, బీమా, వ్యవసాయ, రాయితీలు, రెవెన్యూ శాఖల నుంచి ఇబ్బందులు వంటి పలు అంశాలను ఏకరవు పెట్టారు. ఆయా సమస్యలన్నింటినీ క్రోడీకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని కోదండరాం కౌలు రైతులకు హావిూ ఇచ్చారు.



