ఖమ్మం ఎంపీ వ్యాపార సంస్థల్లో…  ఐటీ సోదాలు


– హైదరాబాద్‌, ఖమ్మం సహా 18చోట్ల దాడులు
హైదరాబాద్‌, సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి) : ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాపార సంస్థల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు మంగళవారం సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌లో ఆరు చోట్ల, ఖమ్మంలో 12 చోట్ల ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తున్నారు. ఖమ్మం నగరంలోని శ్రీశ్రీ సర్కిల్‌ సవిూపంలోని ఎంపీ నివాసంలో ఉదయం 9గంటల నుంచి సోదాలు చేపట్టారు. ఎంపీ ఇంటిలోకి ఎవరూ ప్రవేశించకుండా రెండు గేట్లను మూసివేశారు. మరోవైపు బంజారాహిల్స్‌లోని రాఘవ ఇన్‌ఫ్రా కార్యాలయంలో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆదాయపు పన్ను చెల్లింపుల విషయంలో ఐటీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ తనిఖీలు బుధవారం కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఐటీ అధికారులను సంప్రదించినప్పటికీ ఎలాంటి సమాదానం రాలేదు. అదేవిధంగా శ్రీనివాస్‌రెడ్డి సొంత గ్రామం కల్లూరు మండలంలోనూ దాడులు నిర్వహింస్తున్నట్లు సమాచారం. శ్రీనివాస్‌రెడ్డి సంబంధాలు కలిగి ఉన్ని వ్యాపార సంస్థలపై ఐటీ అధికారులు దాడులు చేపడుతున్నారు. కాగా ఈ సోదాలపై ఎంపీ పొంగులేటి స్పందించారు. ఇవి సాధారణ సోదాలేనని స్పష్టం చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా నుంచి గెలుపొందిన పొంగులేటి 2016 ఏప్రిల్‌లో తెరాసలో చేరారు. తెరాస మద్దతుగా ఉన్న ఎంపీపై ఐటీ సోదాలు జరగటం రాజకీయంగా చర్చనీయాంశమైంది.