గంజాయి అడ్డాగా విశాఖ

ఇక్కడి నుంచి అక్రమ రవాణా
విశాఖపట్టణం,మార్చి5(జ‌నంసాక్షి):  విశాఖనగరంలో గంజాయి వ్యాపారం పెచ్చువిూరిందని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక్కడి నుంచే వివిధ ప్రాంతాలకు రవాణ జరగడంపై సర్వత్రా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా యువత పెడమార్గం పట్టే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిని ఉక్కుపాదంతో అణచి వేయాలని పలువురు డిమాండ్‌ చేశారు. విశాఖనగరంలో విచ్చలవిడిగా గంజాయి వ్యాపారం సాగుతోందన్నారు. ఏజెన్సీలో గంజాయి సాగు విపరీతంగా ఉన్నా చంద్రబాబు ప్రభుత్వానికి పట్టడం లేదని ఆరోపించారు. సుందర విశాఖనగరం గంజాయి వ్యాపారానికి అడ్డాగా మారడం నగర వాసులకు సిగ్గుగా ఉందన్నారు. ప్రతి రోజూ గంజాయి స్మగ్లింగ్‌ కేసులు బయటపడుతున్నా వీటిని అరికట్టలేకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని పేర్కొన్నారు. గంజాయి మత్తుకు అలవాటు పడి యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందించి గంజాయి సాగు, రవాణా చేసేవారిపై తగు చర్యలు గైకొనాలని విజ్ఞప్తి చేశారు. నగర పోలీసు కమిషనర్‌ కూడా దీనిపై దృష్టి సారించాలని కోరారు.