గంజాయి రవాణాపై ఇక ఉక్కుపాదం

మూలాలపై ఆరాతీస్తున్న పోలీసులు
సాగు, వ్యాపార సామ్రాజ్యంపై నిఘా
విశాఖపట్టణం,అక్టోబర్‌27( జనం సాక్షి); విశాఖతో పాటు చుట్టుపక్కల మన్యంలో గంజాయి సాగుతో పాటు స్మగ్లింగ్‌ పట్టపగ్గాలేకుండా సాగుతోంది. రైతులను బెదరించి గంజాయి సాగు చేయిస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మారుమూల ఏజెన్సీలో గంజాయి సాగు సాగుతోందని ఇప్పటికే డిజిపి ప్రకటించారు.
ఈ క్రమంలో గంజాయి పట్టివేతకు ప్రత్యేక వ్యూహం అమలు చేయబోతున్టన్లు డిజిపి ప్రకటించారు. పోలీసులు అంతుచిక్కకుండా విభిన్న పద్ధతుల్లో ముఠాలు సరుకు రవాణా చేస్తూ కోట్లు గడిస్తున్నారు. కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా మాదక ద్రవ్యాల విక్రయాలు జరపడం ఆందోళన కలిగిస్తోంది. విశాఖ ఏజెన్సీ నుంచి జిల్లా సరిహద్దు విూదుగా నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల నుంచి గ్రామాల వరకు తరలిస్తూ గుట్టుగా విక్రయాలు జరుపుతున్నాయి. ఇతర రాష్టాల్రకు సైతం ఇక్కడి నుంచి రవాణా చేస్తుండడం విశేషం. తక్కువ సమయంలో లక్షలకు లక్షలు సంపాదిచవచ్చనే ఉద్దేశంతో చదువుకున్న విద్యార్థులు సైతం గంజాయి వ్యాపారంలో దిగి కటకటాలపాలవుతున్నారు. గడచిన పది నెలల్లో జిల్లాలో ఏకంగా రూ.11.74 కోట్ల విలువైన సరుకు పట్టుబడగా, చిక్కకుండా తరలిపోతున్న గంజాయి వందల కోట్లలో ఉంటుందని పోలీసుల అంచనా. నిత్యం ఎక్కడోచోట వందల కేజీల గంజాయి పట్టుబడుతుండడం స్మగ్లింగ్‌ తీవ్రతను చాటుతోంది. అయితే కంటికి చిక్కకుండా రకరకాల మార్గాల్లో తరలిపోతున్న సరుకు వందల కోట్లలోనే ఉంటోంది. వాస్తవానికి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో వేల ఎకరాల్లో గంజాయి సాగు గుట్టుగా జరుగుతోంది. అక్కడి నుంచి కొన్ని మఠాలు జిల్లాలో రహస్య ముఠాలకు సరుకు చేరవేస్తుండగా, మరికొందరు స్మగ్లర్లు నేరుగా అక్కడి నుంచి గంజాయి జిల్లాలోకి డంప్‌ చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీలోని పాడేరు, చింతపల్లి విూదుగా జిల్లాలోని రంపచోడవరం, ఏలేశ్వరం, కూనవరం,చింతూరు, ఎటపాక విూదుగా, ఇటు నర్సీపట్నం నుంచి తుని, అన్నవరం విూదుగా గంజాయి గుట్టుగా జిల్లాలోకి వాలిపోతోంది. ఈ క్రమంలో కార్లు, వ్యాన్సు, బస్సులు, లారీలు, ద్విచక్రవాహనాల్లో ఎన్ని రకాలుగా వీలుంటే అన్ని రకాలుగా గంజాయి జిల్లాలోకి డంప్‌ అవుతోంది. విశాఖలో గడచిన కొన్ని నెలల్లో పట్టుబడ్డ సరుకు అంతా జిల్లాలోకి, జిల్లా విూదుగా తమిళనాడు, గుజరాత్‌, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌ తదితర రాష్టాల్రకు రవాణా అవుతున్నట్టు ఇప్పటికే అనేకసార్లు పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ఎక్కడికక్కడ అనేక స్మగ్లర్లు జిల్లాలోనే మకాం వేసి స్థానికంగా గంజాయి విక్రయాలు, రవాణా కూడా చేస్తున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల నుంచి జిల్లాలో అనేక ప్రాంతాల్లోకి గంజాయి ముద్దలు, ద్రవరూపంలో వచ్చి
పడుతోంది. అయితే అక్కడక్కడా కొందరు రాజకీయ పార్టీల నేతల పాత్ర కూడా స్మగ్లింగ్‌లో వెల్లడవుతుండడం విశేషం. రహస్యంగా గంజాయి విక్రయాలు జరగడంతోపాటు వినియోగం సైతం పెరగడం కలవరపరుస్తోంది. కాలేజీ విద్యార్థులే ముఠాలుగా ఏర్పడి స్మగ్లింగ్‌, విక్రయాలు చేస్తున్న ఘటనలు ఇటీవల పోలీసులకు పట్టుబడ్డ కేసుల్లో వెలుగులోకి వచ్చాయి. కాగా సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు, ముమ్మర తనిఖీలతో విశాఖ నుంచి గంజాయి రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు గట్టిగా ప్రయత్నాలు మొదలు పెట్టారు.