గగనసీమలో మరో ఘనవిజయం

మైక్రోశాట్‌-ఆర్‌ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం

అవాంతరాలు లేకుండా సాగిన అర్థరాత్రి ప్రయోగం

ప్రధాని మోడీ సహా పలువురి ప్రశంసలు

న్యూఢిల్లీ,జనవరి25(జ‌నంసాక్షి): అంతరిక్షరంగంలో వరుసగా ఘనవిజయాలు సాధిస్తున్న ఇస్రో తనకు తిరుగులేదని మరోమారు చాటుకుంది. అనేక రకాల ప్రయోగాలతో ఇప్పటికే ప్రపంచ పటంలో అభివృద్ది చెందిన దేశాల సరసన భారత్‌/-ను నిలిపింది. ప్రయోగాల్లో కొత్త ఒరవడిని సృష్టిస్తూ ఇస్రో అంతరిక్ష చరిత్రలో కొత్త చరిత్రను లిఖిస్తోంది. సైనిక అవసరాల కోసం తయారుచేసిన మైక్రోశాట్‌-ఆర్‌ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ సీ 44 రాకెట్‌ విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీంతోపాటు చెన్నై విద్యార్థులు రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత తేలికైన ఉపగ్రహం కలాంశాట్‌ను కూడా తన వెంట తీసుకెళ్లింది. 28 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం గురువారం రాత్రి 11.37కు శ్రీహరికోటలోని సతీశ్‌ధావన్‌ అంతరిక్ష కేంద్రంలో ఉన్న మొదటి ల్యాంచ్‌పాడ్‌ నుంచి పీఎస్‌ఎల్వీ సీ 44 గగనతలంలోకి దూసుకెళ్లింది. ప్రశాంతమైన వాతావరణం, గగనతలంలో మిణుకుమిణుకుమంటున్న నక్షత్రాల సాక్షిగా ఇస్రో నమ్మినబంటైన పీఎస్‌ఎల్వీ మరోమారు తనపై శాస్త్రవేత్తలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ.. రెండు ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది. ఈ కొత్త ఏడాదిలో ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం ఇది. పీఎస్‌ఎల్వీకి ఇది 46వ ప్రయోగం. పీఎస్‌ఎల్వీ మోసుకెళ్లిన మైక్రోశాట్‌-ఆర్‌ బరువు 740 కిలోలు. ఇది ఇమేజింగ్‌ శాటిలైట్‌. దీంట్లో ఉండే శక్తిమంతమైన కెమెరాలతో ఫొటోలు తీస్తుంది. సైనిక అవసరాల కోసం దీనిని రూపొందించారు. గగనతలంలోకి ప్రవేశించిన 13 నిమిషాల 30 సెకన్ల అనంతరం 274 కి.విూ. దూరంలో ఉన్న పోలార్‌ సన్‌ సింక్రనస్‌ కక్ష్యలోకి మైక్రోశాట్‌-ఆర్‌ను పీఎస్‌ఎల్వీ సురక్షితంగా చేర్చింది. అనంతరం రాకెట్‌ నాలుగోదశ.. కలాంశాట్‌-వీ2ను మరింతపైకి తీసుకెళ్లింది. దీని నిర్దేశిత కక్ష్య భూమికి 450 కి.విూ.ల ఎత్తులో ఉంది. ఇక్కడికి చేరటానికి 90 నిమిషాలు పడుతుంది. కేవలం 10 సెంటీవిూటర్ల సైజులో 1.2 కిలోల బరువు మాత్రమే ఉండే కలాంశాట్‌-వీ2ను చెన్నైలోని స్పేస్‌కిడ్జ్‌ ఇండియా అనే ప్రైవేటుసంస్థకు చెందిన విద్యార్థులు తయారు చేశారు. దీనికి అయిన వ్యయం రూ.12 లక్షలు. ఆరు రోజుల్లో దీనిని రూపొందించారు. ఇప్పటివరకూ ప్రపంచంలో తయారుచేసిన ఉపగ్రహాల్లోకెల్లా ఇదే అత్యంత తేలికైనది. అత్యంత తేలికైన నానోశాటిలైట్‌లను కమ్యూనికేషన్స్‌లో ఎలా వినియోగించుకోవచ్చన్న దానిపై పరిశోధనలు నిర్వహించటానికి దీనిని ప్రయో గించారు. ఈ తరహా బుల్లి శాటిలైట్లు విపత్తు సమయాల్లో నిర్వహించే సహాయక చర్యల్లో ఉపయోగ పడనున్నాయి. దీనిని అంతరిక్షంలోకి తీసుకెళ్లటానికి ఇస్రో ఒక్క రూపాయి కూడా తీసుకోకపోవటం విశేషం. 2017లో 64 గ్రాముల బరువున్న కలాంశాట్‌ తొలి వర్షన్‌ను రూపొందించారు. దీనికి గులాబ్‌జామూన్‌ అనే ముద్దుపేరు కూడా పెట్టారు. దీనిని నాసా ప్రయోగించింది. కానీ, అది నిర్దేశిత కక్ష్యను చేరలేదు. ఇస్రో ఈసారి ఒక కొత్త ప్రయోగం చేసింది. సాధారణంగా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే రాకెట్‌ చివరిదశ రోదసిలోనే ఉండి అక్కడ వ్యర్థపదార్థంగా మారిపోతుంది. కానీ, ఈసారి ఆ చివరిదశ రాకెట్‌ను కూడా ఉపయోగించుకునే వినూత్న టెక్నాలజీని ఇస్రో అభివృద్ధి చేసింది. నాలుగోదశ రాకెట్‌ ఉన్నత కక్ష్యలోకి వెళ్లి.. అక్కడ ఆర్బిటల్‌ ఎ/-లాట్‌ఫాం (వేదిక)లాగా ఉపయోగపడనుంది. తదనంతరకాలంలో ఇస్రో చేపట్టే ప్రయోగాలకు ఇది పనికొస్తుంది. అంతేకాదు, పీఎస్‌ఎల్వీ ప్రయోగానికి ఇస్రో ఈసారి కేవలం రెండు బూస్టర్లను మాత్రమే ఉపయోగించింది. ఇస్రో మాజీ అధిపతులు కస్తూరిరంగన్‌, కిరణ్‌కుమార్‌ కూడా ప్రయోగాన్ని దగ్గరుండి వీక్షించారు. పీఎస్‌ఎల్వీ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సూక్ష్మ గురుత్వాకర్షణ (మైక్రోగ్రావిటీ)పై ప్రయోగాల కోసం అంతరిక్ష వేదికగా నాలుగో దశ స్పేస్‌ రాకెట్‌ను ఉపయోగిస్తున్న తొలిదేశంగా భారత్‌ నిలిచిందన్నారు. శుక్రవారం ఉదయం ప్రధాని ట్విటర్లో స్పందిస్తూ… పీఎస్‌ఎల్వీని మరోసారి విజయవంతంగా ప్రయోగించిన మన అంతరిక్ష శాస్త్రవేత్తలకు హృదయపూర్వక అభినందనలు. ఈ ప్రయోగం నైపుణ్యత గల భారత విద్యార్ధులు రూపొందించిన కలాంశాట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగంతో మైక్రోగ్రావిటీపై పరిశోధనల కోసం అంతరిక్ష వేదికగా నాలుగో దశ స్పేస్‌ రాకెట్‌ను ఉపయోగిస్తున్న తొలి దేశంగా భారత్‌ నిలిచిందని పేర్కొన్నారు.